Modi Amit Shah Hyderabad Tour: తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడం కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఢిల్లీలో ముఖ్యమైన నేతల్ని కలవడం, ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవేగౌడ, కుమార స్వామిని కలవడం వంటివి చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చి, కేసీఆర్ కుటుంబంపై నేరుగా విమర్శలు చేశారు. అంతకుముందు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా అమిత్ షా కూడా తెలంగాణకు వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. వీటి కోసం బీజేపీ కసరత్తును ప్రారంభించింది. ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. జులై నెలలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ఎల్. సంతోష్ హైదరాబాద్ కు బుధవారం వచ్చారు.
అయితే, మూడు రోజల పాటు హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సమావేశాల కోసం ప్రధాని మోదీ, అమిత్ షా మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు.
కేంద్రం అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
మరోవైపు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించాని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తెలంగాణపై బీజేపీ ఏ స్థాయిలో దృష్టి పెట్టిందో ఈ పరిణామమే చాటుతోంది. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి టూరిజం మంత్రిగా ఉండటంతో ఆయన శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణలోనూ, ఢిల్లీలోనూ నిర్వహిస్తోంది. ఇప్పుడు కేంద్రం కూడా చేయాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణ త్యాగం చేసిన యువతను 'అన్ సంగ్ హీరోస్' పేరుతో ప్రస్తావించడం మొదలు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ కట్టడాల గొప్పదనం, నిర్మాణ శైలి తదితరాలన్నింటినీ ప్రస్తావించనున్నట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్‌లో గురువారం సాయంత్రం ఈ కార్యక్రమం జరుగుతుంది. కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర సాంస్కృతిక విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. తెలంగాణ సింగర్ హేమచంద్ర సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.