తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. పద్దులపై చర్చిస్తుండగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసెంబ్లీ భవనంలో తాము ఎదుర్కొంటున్న సమస్యను ప్రస్తావించారు. అసెంబ్లీకి వచ్చిన తమకు టిఫిన్ చేసేందుకు కూడా సదుపాయం కూడా లేదని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఎమ్మెల్యేకు ఇది అవమానకర అంశం అని అన్నారు. తాను ఉదయాన్నే వచ్చేటప్పుడు ఇంటి నుంచి అల్పాహారం తెచ్చుకున్నానని, కానీ తినేందుకు స్థలం లేదని చెప్పారు. పరిస్థితి గమనించిన కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క తమ ఆఫీసులోకి తీసుకెళ్లారని చెప్పారు.


ఈటల సమస్యను మంత్రి హరీశ్ రావు తప్పుబట్టారు. బడ్జెట్ గురించి చర్చలు చేస్తున్న సమయంలో ఇలాంటి ఫిర్యాదులు తప్పు అని అన్నారు. ఇవి స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసి పరిష్కరించుకోవాల్సిన అంశాలని చెప్పారు. విపక్ష నేతలకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బడ్జెట్‌పై ప్రశ్నలు అడగాలని సూచించారు. అసెంబ్లీలో పెట్టుకున్న నిబంధన ప్రకారం కనీసం ఐదుగురు సభ్యులు ఉంటేనే కార్యాలయం కేటాయిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.


దీనిపై మళ్లీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గతంలో జయప్రకాశ్ నారాయణ ఒక్కరే అయినా ఆయనకు గది ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సీపీఎం, సీపీఐ నుంచి ఒక్క సభ్యుడు ఉన్నా వారికి కూడా ఆఫీసు కేటాయించిన సంగతిని గుర్తు చేశారు. ముగ్గురు సభ్యులు ఉన్నా తమకు ఆఫీసు ఎందుకు కేటాయించరని ప్రశ్నించారు. తమకు నేచురల్ కాల్ వచ్చే పరిస్థితిలో ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ఇది శాసనసభ్యులను అవమానపర్చడమే అని, ఇంత అన్యాయం ఉంటుందా అని అన్నారు.


అనంతరం వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమస్యకు ఇది వేదిక కాదని చెప్పారు. నేచురల్ కాల్స్ వస్తే వెళ్లేందుకు అసెంబ్లీలో చాలా సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. స్పీకర్ ను కలిసి ఫిర్యాదు ఇస్తే, అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని, తమకు ఏం అభ్యంతరం లేదని అన్నారు.


దీనిపై మళ్లీ ఈటల రాజేందర్ స్పందిస్తూ.. ఈ సమస్య గురించి స్పీకర్‌ను అరడజను సార్లు కలిశామని గుర్తించారు. బీఏసీ సమావేశంలోనూ ప్రస్తావించగా తిరస్కరించారని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీనియర్ సభ్యుడైన ఈటల రాజేందర్ ఈ విషయాన్ని కావాలనే ఆన్ రికార్డ్ చేస్తున్నారని అన్నారు. సభ నియమాలు అన్నీ సభాపతి ఆధ్వర్యంలోనే ఉంటాయని, ఆయన్ను వ్యక్తిగతంగా కలవాలని సూచించారు. ఈ అంశాలను పదే పదే ప్రస్తావించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారని అన్నారు.