Vishnu Vardhan Reddy on KTR Comments: పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం సెస్సు విధించి కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నుంచి రూ.30 లక్షల కోట్లు వసూలు చేసిందని, ఇంధన ధరలు ఇకనైనా తగ్గించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.  ముడి చమురు ధర పెరగలేదని, మోదీ చమురు ధర పెరిగిందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని చూపిస్తూ తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధరతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరలను తెలుపుతూ పోస్ట్ చేశారు బీజేపీ నేత. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలోనే పెట్రోల్ ధర మండిపోతోందని ట్వీట్ ద్వారా తెలిపారు. 


బీజేపీ పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ రేట్ ఎంత, మీ టీఆర్ఎస్ పాలనలో మన తెలంగాణలో ధర ఎంత వివరాలు ఇవి అని ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పాలిత రాష్ట్రం తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 గా ఉంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఇదే అత్యధికమని విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.51, గుజరాత్ లో పెట్రోల్ ధర రూ. 96.31, ఉత్తర్ ప్రదేశ్ లో రూ. 96.52, హిమాచల్ ప్రదేశ్ రూ. 97.58, ఉత్తరాఖండ్ లో లీటర్ పెట్రోల్ రూ. 95.28 కే విక్రయాలు జరుగుతున్నాయని ప్రియమైన కేటీఆర్ ఈ వివరాలు గమనించాలంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.






కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవీ..
టీఆర్ఎస్ ప్రభుత్వం కుల, మత తేడా లేకుండా రాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు మంత్రి కేటీఆర్‌. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం సెస్ విధించి రూ.30 లక్షల కోట్లు వరకు సామాన్యుల నుంచి వసూలు చేసిందన్నారు. ముడి చమురు ధర పెరగలేదని, కేవలం మోడీ చమురు ధర పెరిగిందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో శనివారం ఏర్పాటు చేసిన లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సరుకు లేక లక్షల కోట్ల సెస్సులు దండుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా లీటరు పెట్రోలు రూ.70, లీటరు డీజిల్‌ రూ.65లకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


‘మిషన్‌ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నాం. 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 8 ఏళ్లుగా అన్ని వర్గాల సంక్షేమాన్ని చూస్తున్న ప్రభుత్వం మాది. మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించడం లేదు. పైగా వడ్లు కొనమంటే నూకలు తినమని చెబుతోందని’ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.