Minister Ktr: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో నేతల చేరికలు ఊపందుకున్నాయి. ఎన్నికల తరుణంలో నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కని నేతలకు వేరే పార్టీ నుంచి ఏదైనా ఆఫర్ చేస్తే వెంటనే గోడ దూకేస్తూ ఉంటారు. ఇటీవల కాంగ్రెస్‌లోకి చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్‌లోకి కూడా నేతల చేరికలు మొదలైనట్లు కనిపిస్తుంది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత కాషాయ పార్టీలో దూకుడు తగ్గింది. దీంతో ఆ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదనే కారణంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరుతున్నారు. శుక్రవారం బీజేపీ నేత వెంకట్ రెడ్డి కారెక్కారు. ఆయన సతీమణి పద్మా వెంకట్ రెడ్డి కూడా గులాబీ గూటికి చేరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేటీఆర్ వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటరెడ్డి బీజేపీ గద్వాల్ జిల్లా ఇంచార్జ్‌గా ఉండగా.. ఆయన సతీమణి పద్మా వెంకట రెడ్డి బాగ్ అంబర్‌పేట్ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు.
దాదాపు 40 ఏళ్లుగా వెంకటరెడ్డి బీజేపీలో కొనసాగారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుంచి అంబర్‌పేట టికెట్‌ను ఆయన ఆశించారు. కిషన్ రెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కానీ ఆయన నుంచి టికెట్‌కు సంబంధించి ఎలాంటి హామీ రాకపోవడంతో గత కొంతకాంగా బీజేపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇటీవల వెంకటరెడ్డి దంపతులు బీజేపీకి రాజీనామా చేయగా.. అనంతరం శుక్రవారం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్లు బీజేపీలో పనిచేశానని, అంబర్‌పేట టికెట్ గురించి మాట్లాడేందుకు కిషన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నిస్తే సమయం ఇవ్వలేదని తెలిపారు. అంబర్‌పేట నుంచి మీరు పోటీ చేయకపోతే తాను పోటీ చేస్తాననే విషయాన్ని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, కానీ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సమాధానం దాటవేసినట్లు వెంకటరెడ్డి చెప్పారు. ఈ పరిణామాల క్రమంలో మనస్తాపానికి గురై బీజేపీని వీడినట్లు వెంకటరెడ్డి పేర్కొన్నారు.
అయితే పార్టీ బలహీనంగా ఉన్నచోట ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలస్తోంది. అటు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలను బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగిస్తోంది. బీఆర్ఎస్‌లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు బీఆర్ఎస్ టికెట్ కేటాయించలేదు. ఆమె స్థానంలో జాన్సన్ నాయక్‌కు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించారు. దీంతో రేఖా నాయక్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఆమె భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ హస్తం గూటికి చేరారు. తాను కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఇప్పటికే రేఖా నాయక్ ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీలో మారాలనే యోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.