BJP Janasena Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జనసేన పొత్తుల విషయంలో మరో అడుగుపడినట్లు తెలుస్తోంది. జనసేనకు కేటాయించే సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం 6 గంటలకు బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అవనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కిషన్ రెడ్డి భేటీ అవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 66 స్థానాల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి? అవి పోగా మిగిలిన వాటిలో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 


ఆ సీట్లను ఇస్తే ఊరుకునేది లేదు
అయితే జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సీట్లు జనసేనకు కేటాయిస్తారంటూ బీజేపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి బీజేపీ నేతలు వేర్వేరుగా సమావేశమైనట్టు తెలుస్తోంది. అంతే కాదు ఆయా నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలు తేల్చి చెబుతున్నారు. ఇటీవల కూకట్‌పల్లి కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూకట్‌పల్లి సీటు జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. కూకట్‌పల్లి సీటును జనసేనకు ఇచ్చే ప్రతిపాదనను మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి వ్యతిరేకించారు.  


శేరిలింగంపల్లి సీటుపై మాకే కావాలి
అలాగే శేరిలింగంపల్లి సీటు ఇవ్వొద్దంటూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పొత్తులో  శేరిలింగంపల్లి టిక్కెట్‌ను జనసేనకు కేటాయించడంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శేరిలింగంపల్లి టికెట్‌ను రవికుమార్ యాదవ్‌కు ఇవ్వాల్సిందేనని కొండా విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో కీలకమైన శేరిలింగంపల్లి సీటు రవికుమార్ యాదవ్ కోసం కొండా పట్టుపడుతున్నారు. మెదట నుంచి పనిచేస్తున్న వారికి అన్యాయం చేయొద్దని ఆయన వాపోతున్నారు. జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపు బీజేపీ నాయకత్వానికి తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. 


జనసేనకు కేటాయించే సీట్లతో మరికొన్ని సమస్యలు
మెదక్ జిల్లా నర్సాపూర్ టికెట్‌ను మార్చాలని గోపికి కేటాయించాలని కార్యకర్తలు పార్టీ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. మురళీయాదవ్ భూకబ్జాదారుడని వారు ఆరోపించారు. వేముల వాడ టికెట్ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తొలనొప్పిగా మారింది. కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ ఈ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈటలతోపాటు బీజేపీలో చేరిన ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తాను పార్టీలో చేరిందే వేములవాడ టికెట్ కోసమని ఉమ చెబుతున్నారు. ఇదే సీటుపై మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు గురి పెట్టారు.


ఇప్పటి వరకు రెండు జాబితాలు
తెలంగాణ బీజేపీ ఇప్పటి వరకూ రెండు జాబితాలు ప్రకటించింది. 119 స్థానాలకు గాను 53 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇంకా 66 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. కానీ కసరత్తు ఏ మేరకు జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ వైపు జనసేనతో పొత్తు వల్ల  కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి సెగ్మెంట్లను ఇవ్వాలని జనసేన కోరుతోంది. ఈ సెగ్మెంట్లను వదులుకోవద్దని బీజేపీ నేతలు పట్టుబట్టుతున్నారు. స్థానిక కమలం నేతల ఆందోళన నిరసన రూపం దాల్చింది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది.