Bhadradri Kothagudem Accident : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇల్లెందు-మహబూబాబాద్‌ మధ్య కోటిలింగాల వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ప్రమాదంలో  కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ తో సహా ముగ్గురు ప్రమాదస్థలిలోనే మృతిచెందారని పోలీసులు తెలిపారు.  మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించారని చెప్పారు. మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్‌, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్‌, శివ అని పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేటకు చెందిన రణధీర్‌ గా తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  అయితే వీళ్లంతా  ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 


ప్రీ వెడ్డింగ్ షూట్ లోకేషన్ల కోసం వెళ్తూ 


 మహబూబాబాద్‌ వైపు నుంచి ఇల్లెందు వెళ్తోన్న టీఎస్‌03ఎఫ్‌ సీ 9075 గల కారును, ఇల్లెందు నుంచి మహబూబాబాద్‌ వైపు వెళ్తున్న ఏపీ16టీజీ 3859 నెంబర్ గల లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు యువకుల్లో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఒకరు మార్గమధ్యలో మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు వరంగల్‌ జిల్లా కేంద్రం బట్టలబజారుకు చెందిన ఫొటోస్టూడియో యజమాని బైరి రాము, వరంగల్‌ నగరానికి చెందిన బాసబత్తిని అరవింద్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు కూడా వరంగల్‌ జిల్లాకు చెందిన రిషీ, కళ్యాణ్‌గా తెలుస్తోంది.  వీళ్లంతా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని ఫొటో షూట్‌కు  లోకేషన్ల గుర్తించడానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.  


కూకట్ పల్లిలో రోడ్డు ప్రమాదం 


కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలోని మెట్రో పిల్లర్‌ నెం 822 సమీపంలో గుర్తు తెలియని టిప్పర్‌ మోటారు సైకిల్‌ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వినోద్‌కుమార్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హేమంత్ కుమార్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం  సురారం గ్రామంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. 


లారీని ఢీకొట్టిన టెంపో 


వైఎస్ఆర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకుని కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనే సమయంలో ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు అనూష, ఓబులమ్మ, రామలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న  పోలీసులు క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన చాపాడు పోలీసులు దర్యాప్తు చేశారు.


ఇఫ్లూ వర్సిటీలో బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య  



హైదరాబాద్ ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హర్యానాకు చెందిన విద్యార్థిని ఇఫ్లూలో MA ఇంగ్లీష్ కోర్స్ చేస్తుంది. ఫ్యామిలీ సమస్యలతో సూసైడ్ చేసుకుందని  ఓయూ  పోలీసులు అంటున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.