Bengaluru Rave Party FIR: బెంగళూరు రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో కర్ణాటక పోలీసులు విచారణ జరుపుతుండగా.. మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం వారు ఎఫ్ఐఆర్ ను సవరించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి రక్త నమూనాలను ఆ రోజే సేకరించి పరీక్షలకు పంపగా.. ఆ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన తెలుగు నటుల వివరాలను కూడా వెల్లడించారు. తెలుగు నటి పేరు క్రిష్ణవేణి అని, మరో నటి అషి రాయ్ లకు పాజిటివ్ అని తేలిందని పోలీసులు వెల్లడించారు.


రేవ్ పార్టీలో 73 మంది యువకులు పార్టీలో పాల్గొనగా 59 మందికి పాజిటివ్ వచ్చిందని.. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే.. 86 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వారికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు నోటీసులు పంపారు. ఈ రేవ్ పార్టీని హెబ్బగుడి పోలీస్ స్టేషన్ లో అధికారులు విచారణ జరుపుతున్నారు. రేవ్ పార్టీ నిర్వహించిన నిందితుల్లో A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 నాగబాబు, A4 రణధీర్ బాబు, A5 మహమ్మద్ అబూబాకర్, A6 గా గోపాల్ రెడ్డి, A7 గా 68 మంది యువకులు, A8 30 మంది యువతులు ఉన్నట్లుగా ఎఫ్ఐఆర్ లో చేర్చారు.


రేవ్ పార్టీ నుంచి 14.40 గ్రాముల MDMA పిల్స్, 1.16 గ్రామ్స్ MDMA క్రిస్టల్, 5 గ్రాముల కొకైన్, కొకైన్ తో ఉన్న 500 రూపాయల నోట్లు, 5 మొబైల్ ఫోన్స్, ఒక ఫోక్స్ వ్యాగన్ కారు, ల్యాండ్ రోవర్ కారు, కోటిన్నర విలువైన డీజే ఎక్విప్మెంట్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.


పార్టీ ఆర్గనైజ్ చేసిన వ్యక్తి A2 అరుణ్ కుమార్ అని, ఫామ్ హౌజ్ బుక్ చేసిన వ్యక్తి వాసు స్నేహితుడు గోపాల్ రెడ్డి అని ఎఫ్ఐఆర్ లో వివరించారు. A4 అయిన రణధీర్ కారులో డ్రగ్స్ లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు.