తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే బతుకమ్మ చీరలు సిద్ధం అయ్యాయి. ఈ సారి మరిన్ని రంగుల్లో చీరలను నేయించారు. వచ్చే దసరా పండుగలోపు వీటన్నింటికీ అర్హులందరికీ పంపిణీ చేయనున్నారు. ఇప్పటికీ చీరలన్నీ జిల్లా కేంద్రాలకు కూడా చేరాయి. అక్టోబర్ 6వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే చీరలు పంపిణీ చేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. అక్టోబరు 2 నుంచి చీరల పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ సారి సరికొత్తగా ఏకంగా 290 రంగుల్లో బతుకమ్మ చీరలు తయారు చేయించారు.
గతేడాది చీరల పంపిణీ సందర్భంగా కేటీఆర్ ఆదేశాల మేరకు మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఆ సూచనలను బట్టి ఈ సారి సరికొత్తగా 19 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 290 రంగులు, రకాల్లో సరికొత్తగా చీరలు నేయించారు. డాబీ అంచు చీరలు ఈ సారి బతుకమ్మ పండుగకు మరింత ప్రత్యేకతను తీసుకురానుందని అధికారులు తెలిపారు. ఆ పంపిణీ చేసే చీరల ప్యాకింగ్‌ను కూడా అధికారులు ఆకర్షణీయంగా చేశారు. చీరల పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్లు డివిజన్ల వారీగా రేషన్ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
రేషన్ కార్డు చూపి చీర పొందేలా ఏర్పాట్లు
బతుకమ్మ చీరల పంపిణీ కోసం ఏటా రూ.300 కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. ఈసారి ఏకంగా రూ.318 కోట్లను ఖర్చు చేసింది. దాదాపు 16 వేల మగ్గాలపై 10 వేల నేత కుటుంబాలు ఆరు నెలల పాటు శ్రమించి చీరలను తయారు చేశాయి. గ్రామాల్లో రేషన్ డీలర్, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన ఓ కమిటీ పంపిణీని పర్యవేక్షిస్తుంది. పట్టణాలు, నగరాల్లో రేషన్ డీలర్, మున్సిపల్ బిల్ కలెక్టర్, మహిళా సంఘం ప్రతినిధుల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది. రేషన్ సరకులు తీసుకునే ఆహార భద్రత కార్డులతో వచ్చి మహిళలు చీరలు తీసుకొనేందుకు అవకాశం కల్పించారు.
అయితే, బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. 31 జిల్లాల్లో చీరలు పంచనున్నారు. కానీ, హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వల్ల కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో చీరల పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల సంఘాన్ని సంప్రదించిన అనంతరం ఈ రెండు జిల్లాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి