Sai Bhagiratha Case: మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేంద్ర యూనివర్సిటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ వీరంగం సృష్టించడం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రైం నెంబర్ 50/2023 యూ/ఎస్ 341, 323, 504, 506 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. సాయి భగీరథను విచారణకు రావాలని సూచించారు. దుండిగల్ సీఐ బుధవారం విచారణ చేపట్టారు. న్యాయవాదులు కరుణ సాగర్ సమక్షంలో పూచీకత్తుపై సాయి భగీరథ్ కి పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. సాయి భగీరథను ఇంటికి తీసుకెళ్లారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీస్ స్టేషన్ కు తీసువస్తామని న్యాయవాదులు హామీ కూడా ఇచ్చారు. అవసరం అయినప్పుడు పిలుస్తామని దుండిగల్ సీఐ అన్నారు. 


అసలేం జరిగిందంటే..?


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ వివాదం మరింత ముదురుతోంది. తోటి విద్యార్థులు దూషిస్తూ కొడుతున్న ఓ వీడియో ఇప్పటికే వైరల్ అయింది. నిన్నటికి నిన్న మరో వీడియో కూడా విడుదలవడం సంచలనంగా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు ఓ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బండి సంజయ్ కుమారుడి పేరు సాయి భగీరథ్‌. హైదరాబాద్‌లోని మహింద్రా యూనివర్శిటీలో చదువుతున్న  సాయి భగీరధ్.. ఓ జూనియర్ విద్యార్థిని చితకబాదారు. ఈ వీడియోను కూడా తోటి విద్యార్థులు చిత్రీకరించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలపై కేసులు ఏంటని ప్రశ్నించారు. తాను తప్పు చేశాను అందుకే కొట్టాడని బాధితుడే చెప్పాడని మరి అలాంటి సమయంలో కేసు ఎందుకు పెట్టారని నిలదీశారు. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలే కానీ పిల్లలను అడ్డం పెట్టుకొని ఏం రాజకీయం అంటూ మండి పడ్డారు. 


నిజాం మనుమడి అంత్యక్రియలు, యాదాద్రి ఆదాయంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ పక్క దారి పట్టించేందుకే తన బిడ్డ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు బండి సంజయ్‌. ఈ ఘటనలో ఉన్న విద్యార్థుల జీవితాలను నాశనం చేయాలని కేసీఆర్ కుట్ర చేశారని ధ్వజమెత్తారు. తన కుమారుడిని తానే స్వయంగా పోలీస్‌స్టేషన్‌లో సరెండర్ చేస్తానన్నారు బండి సంజయ్‌. నిన్న వెలుగులోకి వచ్చిన వీడియోపై వివాదం కొనసాగుతుండగానే మరో వీడియో బయటకు వచ్చింది. ఓ గదిలో బండి సంజయ్‌ కుమారుడు సహా పలువురు విద్యార్థులు తోటి విద్యార్థిని కొడుతున్నట్టు అందులో ఉంది. పక్కవాళ్లను వద్దని చెప్పి వారిస్తూనే బండి సాయి భగీరథ్ బాధితుడిపై దాడి చేస్తున్నట్టు ఈ వీడియోలో ఉంది. వరుస వివాదాలు, కేసులతో బండి సంజయ్‌ కుమారుడిని సస్పెండ్ చేసింది మహేంద్ర యూనివర్శిటీ. దీనిపై విచారణ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో ఉన్న బండి సంజయ్ కుమారుడు కావడంతో ఈ అంశం రాజకీయ వివాదమయింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బండి సంజయ్ కుమారుడు ర్యాగింగ్ పేరుతో దాడి చేశారని చర్యలు తీసుకుంటారా అని బీజేపీ జాతీయ స్థాయి నేతలను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు.