తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24వ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ యాత్రకు "ప్రజా సంగ్రామ యాత్ర" అని పేరు పెట్టారు. బంధుప్రీతి, అవినీతిపై పోరాటమని బీజేపీ ప్రకటించింది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పేరును ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. 24వ తేదీన బండి సంజయ్ కూడా అదే ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేసి పాదయాత్ర ప్రారంభిస్తారు. వాస్తవానికి ఈ నెల 9వ తేదీ నుంచే బండి సంజయ్ పాదయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పార్టీ పరంగా పలు కమిటీలు నియమించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండటం.. తప్పని సరిగా హాజరు కావాలని హైకమాండ్ ఆదేశించడంతో  వాయిదా వేసుకోకతప్పలేదు. 


 అదే సమయంలో కొత్త కేంద్రమంత్రులందరూ ప్రజా ఆశీర్వాదయాత్రలు చేపట్టాలని బీజేపీ హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. దాంతో కిషన్ రెడ్డి కూడా ప్రజాఆశీర్వాదయాత్రను తెలంగాణలో చేయాల్సి ఉంది.ఈ ఏర్పాట్లను కూడా పార్టీ పరంగా చేయాల్సి ఉండటంతో 24కు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పార్లమెంట్ సమావేశాలుకూడా అయిపోవడం..అప్పటికి కిషన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర కూడా ముగిసిపోతుంది కాబట్టి... బండి సంజయ్ పాదయాత్రకు అడ్డంకులు ఉండవని అంచనా వేస్తున్నారు.  తొలిదశలో సుమారు రెండు నెలల పాటు పాదయాత్ర సాగుతుంది.   తొలి రోజున  భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర మెహదీపట్నం మీదుగా షేక్‌పేటకు చేరుకుంటుంది. 


మరుసటి రోజు ఉదయం గోల్కొండ కోట వద్ద జరిగే సభలో సంజయ్‌ పాల్గొంటారు. చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్‌, సదాశివపేట, సంగారెడ్డి, జోగిపేట ద్వారా మెదక్‌ చేరుకుంటారు.  హుజూరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే వరకు ముందుగా నిర్ణయించిన రూట్‌లోనే పాదయాత్ర సాగుతుంది.   షెడ్యూల్‌ విడుదలయ్యాక హుజూరాబాద్‌లో వారం రోజుల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.   సంజయ్‌ పాదయాత్ర విజయవంతానికి పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లిపోయాయి. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఇప్పటికే 30 నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీకి ఒక్కో బాధ్యత ఇచ్చారు.  


తెలంగాణ రాష్ట్ర సమితిపై దూకుడుగా ఉండే బీజేపీ నేతల్లో బండి సంజయ్ ముందుఉంటారు. కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేస్తూంటారు. టీఆర్ఎస్ నేతల అవినీతిని వెలికి తీస్తున్నామని కేసీఆర్ సహా మంత్రులు జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాదయాత్ర కూడా టీఆర్ఎస్ పాలననే టార్గెట్ చేసుకుని ప్రారంభిస్తున్నారు. పాదయాత్ర విజయవంతం అయితే అటు బండి సంజయ్‌కి ఇటు బీజేపీకి మేలు జరుగుతుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు.