Bandi Sanjay: బండి సంజయ్‌‌పై ఏ కేసు పెట్టారో చెప్పిన పోలీసులు! ఇంతకీ ఏ విషయంలో అరెస్టు చేశారు?

కరీంనగర్ పోలీసులు బండి సంజయ్‌ను అసలు ఏ విషయంపై అరెస్టు చేశారనే దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

Continues below advertisement

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను అర్ధరాత్రి అరెస్టు చేసిన పోలీసులు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తాజా సమాచారం ప్రకారం.. బండి సంజయ్‌పై 151 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 151 CRPC (1 & 2), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లో సెక్షన్ 151 కింద కాగ్నిజబుల్ నేరాలను నిరోధించడానికి అరెస్టు చేస్తారు. ఏదైనా గుర్తించదగిన నేరానికి రూపకల్పన గురించి ముందస్తు సమాచారం తెలిసిన ఒక పోలీసు అధికారి, మేజిస్ట్రేట్ ఆదేశాలు వారెంట్ లేకుండా, అలా రూపకల్పన చేసిన వ్యక్తిని, అరెస్టు చేయవచ్చు. (2) సబ్-సెక్షన్ (1) కింద అరెస్టయిన  వ్యక్తి ఇతర నిబంధనల ప్రకారం అతని నిర్బంధం అవసరం అనిపిస్తే, లేదా ఆ అధికారం ఇవ్వబడినట్లయితే తప్ప, అతని అరెస్టు సమయం నుండి ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ కాలం కస్టడీలో ఉంచకూడదు.

Continues below advertisement

ఏ పేపర్ లీకేజీ విషయంలో అరెస్టు?
కరీంనగర్ పోలీసులు బండి సంజయ్‌ను అసలు ఏ విషయంపై అరెస్టు చేశారనే దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీకి చెందిన గ్రూప్‌-1 సహా ఇతర ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో బండి సంజయ్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి ఆధారాలు ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్‌) రెండుసార్లు నోటీసులు కూడా జారీ చేసింది. విచారణకు హాజరు కాకుండా సంజయ్‌ తన లీగల్‌ టీమ్‌ను పంపించారు. అంతేకాక, గత రెండు రోజులుగా వరుసగా లీకైన పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్నపత్రాల విషయంలో బండి సంజయ్ ను అరెస్టు చేశారనే ప్రచారం జరుగుతోంది. 

పేపర్ లీకేజీ విషయంలో బీఆర్ఎస్ బండారాన్ని బయటపెడతానని, నేడు (ఏప్రిల్ 5) ఉదయం 9 గంటలకు ప్రెస్ మీట్ పెడతానని బండి సంజయ్ నిన్ననే ప్రకటించారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి బండి సంజయ్ ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశారు.

ఆయన హార్ట్ పేషెంట్ - బండి సంజయ్ భార్య అపర్ణ
పోలీసులు బలవంతంగా సంజయ్‌ని అరెస్టు చేశారని ఆయన భార్య అపర్ణ వాపోయారు. తన భర్తకు గతంలో హార్ట్ ఎటాక్ వచ్చిందని, కనీసం టాబ్లెట్‌ వేసుకునే సమయం కూడా ఇవ్వకుండా లాక్కుపోయారని చెప్పారు. తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. హార్ట్ పేషెంట్ అని కూడా చూడకుండా పోలీసులు లాక్కొని వెళ్లడం పట్ల బండి సంజయ్ భార్య అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 

బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ కూడా తన తండ్రి అరెస్టుపై స్పందించారు. 40 మంది పోలీసులు తన తండ్రిని బలవంతంగా తీసుకెళ్లారని భగీరథ్‌ అన్నారు. ఎందుకు వచ్చారో, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని అన్నారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని పదే పదే ప్రశ్నించగా, ప్రివెన్షన్ అరెస్ట్ అని చెప్పినట్ల భగీరథ్ తెలిపారు. పోలీసులు దురుసు ప్రవర్తించడం కారణంగా తన తండ్రి నోటి నుంచి రక్తం వచ్చిందని భగీరథ్ చెప్పారు.

Continues below advertisement