Bandi Sanjay Fires on BJP Leaders: బీజేపీ లీడర్లపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోవాలంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరై ప్రసంగించారు. 
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే
ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై రానున్న 100 రోజుల పాటు ఉద్యమిస్తామన్నారు. ఎన్నికలు సమీపిస్తుండంతో కేసీఆర్ డ్రామాలు, కుట్రలకు తెరతీశారని విమర్శించారు. బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేక దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులతో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్‌ను కలిసిన జాతీయ నేతలంతా.. ప్రస్తుతం కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని ధ్వజమెత్తారు. 
రాష్ట్రంలో అన్ని కులవృత్తులను కేసీఆర్ నాశనం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. బీసీలు బీజేపీ వైపు ఉన్నారని వచ్చే ఎన్నికల్లో వారిని తమ వైపు తిప్పుకునేందుకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటన ఇచ్చారని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ కుట్రలు, నాటకాలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే పీఆర్‌సీ కమిషన్‌ వేస్తున్నట్లు లీకులు ఇస్తున్నారని నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ఒకవేళ పీఆర్‌సీ వేసినా ప్రభుత్వం అమలు చేయదని ఉద్యోగులు కేసీఆర్ మాటలు నమ్మొద్దంటూ కోరారు.
సొంత పార్టీ నేతలకు చురకలు
ప్రసంగంలో బండి సొంత పార్టీ నేతలకు సైతం చురకలంటించారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయడం మానుకోవాలనిమ హితవు పలికారు. కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. తన మీద కొంతమంది ఫిర్యాదులు చేశారని ఆవేదన వ్యక్తం చేసిన బండి.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రెండుసార్లు జైలుకు వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు. అధ్యక్షుడిగా తన కర్తవ్యం నేరవేర్చానన్న సంతృప్తి తనకు ఉందన్నారు. బండి సంజయ్ ముఖ్యం కాదని.. పార్టీ ముఖ్యమని, పార్టీ సిద్ధాంతం కోసం పని చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 
కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జులై 4న నియమితులయ్యారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో కీలక మార్పులు చేయాలని హైకమాండ్ నిర్ణయింకున్న నేపథ్యంలో బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో అనేక మార్లు చర్చలు జరిపి చివరికి బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తసుకున్నారు. 1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నంచి ఇప్పటి వరకు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. 2014లో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial