Bandi Sanjay On Four IAS :   తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు నలుగురు కలెక్టర్లపై కోపం వచ్చింది. వారిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో ఓ నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్ కు ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. ధరణి పేరుతో ఆ నలుగురు భారీ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. వారి వ్యవహారంపై ఆధారాలు సేకరించామని, త్వరలోనే  సదరు కలెక్టర్ల బండారం బయటపెడతామని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేస్తున్న సదరు కలెక్టర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బండి మండిపడ్డారు. ప్రగతి భవన్ లో అన్ని పనులు ఆ నలుగురే చక్కబెడుతున్నారని, అలాంటి వారి వల్ల రాష్ట్రానికి, కష్టపడి పనిచేస్తున్న ఐఏఎస్ లకు చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. 


బండి సంజయ్ ఫైర్ అయిన ఆ నలుగురు కలెక్టర్లు ఎవరు ?          


ఆ నలుగురిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే ఇంతకీ ఆ నలుగురు కలెక్టర్లు ఎవరు అన్న దానిపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితమైన కలెక్టర్ గా పేరు పొందిన వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఇంటిపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. దాదాపుగా ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. ఇప్పుడు పవర్ లో ఉన్న నలుగురు కలెక్టర్లపై బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారు. వారి గురించి స్పష్టమన సమాచారం ఉండే ఉంటుందని అందుకే ఇలాంటి హెచ్చరికలు చేసి ఉంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 


ప్రతి ప్రభుత్వంలోనూ  కొంత మంది అధికారులు సన్నిహితంగా ఉంటారు !           


ప్రతి ప్రభుత్వంలోనూ ప్రభుత్వ పెద్దలకు సన్నిహితమైన అధికారుల కోటరీ ఉంటుంది. వారు ప్రభుత్వ పెద్దల మనసెరిగి నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు అమలు చేస్తూ ఉంటారు. అలాంటి అధికారులు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉన్నారు. వారు  కీలక నిర్ణయాలు తీసుకుంటారని కూడా చెబుతూంటారు. నిజంగానే బండి సంజయ్ వద్ద ఆధారాలు ఉండి.. డీవోపీటీకి ఫిర్యాదు చేస్తే.. ఈ ఆధారాలను సహజంగానే బీజేపీ సీరియస్ గా తీసుకుంటుంది. ఇటీవల బీఆర్ఎస్, బీజేపీ మధ్య పరిస్థితులు ఏ మాత్రం సానుకూలంగా లేవు. బీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టేలా ఏ చిన్న అవకాశం వచ్చినా బీజేపీ వినియోగించుకుటుంది. 


వారిని నియంత్రించడానికే బండి సంజయ్ ఆరోపణలా ?           


అయితే బండి సంజయ్ వద్ద నలుగురు కలెక్టర్లకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే..  వెంటనే డీవోపీటికి ఫిర్యాదు చేయకుండా.. త్వరలో అనే పదం ఎందుకు వాడదారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బండి సంజయ్ ఆరోపణల వెనుక రాజకీయ వ్యూహం ఉందంటున్నారు.  తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా పని చేస్తున్న అధికారులను నియంత్రించడానికి వారు యాక్టివ్ గా ఉండకుండా చేయడానికి ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తున్నారు.ఈ విషయంలో అధికారులకూ స్పష్టత ఉందని.. బండి సంజయ్ బెదిరింపులకు వారు భయపడబోరని అంటున్నారు.