Azharuddin will take oath as minister: మాజీ భారత క్రికెట్ టీమ్ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజహరుద్దీన్ తెలంగాణ మంత్రివర్గంలో చేరనున్నారు. అక్టోబర్ 31, 2025న రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12:15 గంటలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఆహ్వాన పత్రికలు పంపారు.
తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి. అందుకే అజహర్ తో పాటు మరో ఇద్దరు ప్రమాణం చేస్తారన్నప్రచారం జరిగింది.కానీ హైకమాండ్ మాత్రం ఒక్క అజహర్ విషయంలోనే సమాచారం పంపింది. రెండు ఖాళీలు అలాగే ఉంటాయి. వీటి విషయంలో సీఎం రేవంత్..డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంటారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. తన పదవిని సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఆయన పేరును హైకమాండ్ ఖరారు చేయలేదు.
అజహరుద్దీన్ క్రికెటర్‌గా పేరు పొందారు. 1984-2000 మధ్య 99 టెస్టులు, 334 ODIలు ఆడారు. భారత కెప్టెన్ గా చాలా కాలం వ్యవహరించారు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో 5 సంవత్సరాల బ్యాన్ కు గురయ్యారు. 2000లో బ్యాన్ ఎత్తివేశారు. 2009లో కాంగ్రెస్‌లో చేరి మోరాదాబాద్ లోక్‌సభ సీటు గెలిచారు. తర్వాత రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆగస్ట్ 2025లో గవర్నర్ కోటా మేరకు MLCగా నామినేట్ అయ్యారు. కానీ గవర్నర్ ఆమోదించలేదు. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కవాల్సి ఉంటుంది.
ఈ ప్రమాణ స్వీకారం బీఆర్ఎస్, బీజేపీ మోడల్ కోడ్ ఉల్లంఘన అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయడానికి అజహర్ కు పదవి ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అయితే కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రివర్గాన్ని విస్తరించకూడదని ఎక్కడా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. గవర్నర్ కూడా ఆమోదించడంతో ప్రమాణ స్వీకారం జరిగిపోవడం ఖాయంకా కనిపిస్తోంది.