Telangana Congress :  ఢిల్లీలో కాంగ్రెస్ టిక్కెట్ల కసరత్తు నడుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ వరుసగా రెండు రోజుల పాటు సమావేశం అయింది.  టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న చాలా మంది నాయకులు ఢిల్లీ గడ్డపై వాలిపోయారు.  పరిచయం ఉన్న వారందరితో సిఫార్సు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.   క్రీనింగ్‌ కమిటీలో రాష్ట్రం నుంచి పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌ మధుయాష్కీగౌడ్‌ కూడా సభ్యులుగా ఉన్నారు. వీరికి నేతల తాకిడి ఎక్కువగా ఉంది. 


టిక్కెట్లు ఆశిస్తున్న వారంతా ఢిల్లీకి !                                   


అనేక మంది నేతలు సొంత జిల్లాల నుంచి ఢిల్లీకి వెళ్లి వారిని కలుస్తున్నారు. అంతే కాకుండా ఆ నాయకుల ప్రధాన అనుచరులు, వారినే నమ్ముకున్న నేతలు కూడా హస్తినకు వెళ్లారు. ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఎక్కువ మంది హస్త్తినకు చేరుకున్నారు. దాదాపు 35 నుంచి 40 సీట్లకు ఒకే పేరు పంపించినట్టు తెలిసింది. మిగతా నియోజకవర్గాల నుంచి కొన్ని చోట్ల రెండు పేర్లు, మరికొన్ని చోట్ల మూడుపేర్లు పంపించినట్టు పార్టీ నేతలు అంటున్నారు. ఒక్కటే పేరు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్య లేకపోయినా, రెండు, మూడు పేర్లు ఉన్న చోట ఏ ఒక్కరికి ఇచ్చినా మరొకరి నుంచి సమస్య ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు పార్టీ భావిస్తున్నది.


యాభై నియోజకవర్గాల్లో పోటీ ఎక్కువ !                       


జాబితా దఫాదఫాలుగా ప్రకటించకుండా మొత్తం సీట్లను రెండు జాబితాలుగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు వెళ్లి…ఠాక్రే ఎవరు చెప్పితే వింటారో కూడా విచారిస్తున్నట్టు సమాచారం. అక్కడి నుంచి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.  అంతకు ముందు రాష్ట్ర ఇంచార్జిలుగా వ్యవహరించిన ద్విగిజరుసింగ్‌, రామచంద్రకుంతియా, మాణిక్యం ఠాగూర్‌లను కొంత మంది నేతలు ప్రసన్నం చేసుకుంటున్నట్టు తెలిసింది. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మెన్‌ మురళీధరన్‌ సొంత రాష్ట్రమైన కేరళ కూడా వెళ్లి పైరవీలు చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 


గెలిచే వారికే టిక్కెట్లు అంటున్న కాంగ్రెస్  హైకమాండ్ 


 పార్టీ మాత్రం సమర్థత, ప్రజల్లో పలుకుబడి, వారు చేస్తున్న కార్యక్రమాలు బేరిజు వేసి టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి కొన్ని చోట్ల ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. వారు పార్టీకి అన్ని సహయ,సహకారాలను అందించేటట్టు ఆదేశించింది. కొంత మందికి పార్టీ అధికారంలోకి రాగానే ఏదో ఒక పదవి ఇస్తామని ఒప్పిస్తున్నది. ఈసారి ఫైరవీలకు తావులేదంటూ అధిష్టానం చెబుతున్నా…నాయకులు వారి మాటలను పెడచెవిన పెట్టి ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. పైరవీలకు టిక్కెట్లు రాలవని  ఖచ్చితంగా గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతోంది.