భద్రాద్రిలో ఈసారి రాములోరి పెండ్లి మమూలుగా ఉండొద్దు.. పుష్కర పట్టాభిషేకం చూసి భక్తజనం మైమరిచిపోవాలి! మరో 14 ఏళ్లు ఈ వేడుకను జనం గుర్తుపెట్టుకోవాలి! శ్రీరామనవమి ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ చేసిన దిశానిర్దేశమిది! ఈనెల 30న సీతారాముల కల్యాణానికి, మర్నాడు జరిగే పట్టాభిషేకంపై మంత్రి సమీక్ష జరిపారు. కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ వివరించారు. ఈసారి భక్తులు తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున ఏర్పాట్లలో ఎక్కడా లోటు రావొద్దని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 30న సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.


రెండో అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వేలాది భక్తజన సందోహనం నడుమ వైభవోపేతంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఏర్పాటు, చేయాల్సిన సౌకర్యాలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ అనుదీప్ అధ్వర్యంలో ఆలయ అధికారులు, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, రవాణ, గ్రామ పంచాయతి, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, ఫైర్, రెవెన్యూ, ఎండోమెంట్ సంభందిత శాఖల అధికారులు, ఆలయ అర్చకులతో సమీక్ష జరిగింది.


కళ్యాణ మహోత్సవానికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ వివరించారు. ఇప్పటి వరకు 200 క్వింటాల తలంబ్రాలు సిద్ధం చేశామన్నారు. ప్రతి ఒక్కరూ కళ్యాణం తిలకించేందుకు 6 భారీ LCDలు, తెప్పోత్సవం వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డ్, 200 మంది గజ ఈతగాళ్లు, 135 వివిధ రకాల బోట్స్, లైఫ్‌ జాకెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, విద్యుత్ దీపాలు, 4 ఫైర్ ఇంజన్లు, సిగ్నల్ ఇబ్బంది లేకుండా క్షుణ్ణమైన సమాచారం కోసం 30 ప్రత్యేక హ్యాండ్ సెట్స్ ఏర్పాటు చేశామన్నారు.


భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు DPRO అధ్వర్యంలో 25 సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వేదిక పూర్తి మ్యాప్, కళ్యాణం వివరాలు, సమయంతో కూడిన 25 వేల కరపత్రాలు ముద్రిస్తున్నారు. ఈసారి లక్షమందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున స్వామివారి ప్రసాదం, లడ్డూలను అధిక సంఖ్యలో పెంచి, విరివిగా కౌంటర్లలో అందుబాటులో ఉంచుతున్నారు.


భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక వసతి, మరుగుదొడ్లు, ఉచిత వైద్యశిభిరాలను ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్ ప్రాంగణాలు దూరంగా కాకుండా సాధ్యమైనంత దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశారు. తలంబ్రాలకు కొరత రాకుండా చూస్తున్నారు. ఎండకు సొమ్మసిల్లి పడిపోయిన వారికోసం అందుబాటులో ORS ప్యాకెట్లు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ ఉంచుతున్నారు. భక్తులు సులువుగా కల్యాణ ప్రాంగణానికి చేరుకునేలా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.


అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ అప్రమత్తంగా ఉండాలని మంత్రి అజయ్ సూచించారు.  మంటలను ఆర్పే పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కల్యాణ మంటపాలకు రంగులు అద్ది మెరుగులు దిద్దాలన్నారు. నిర్దేశించిన పనులన్నీ 28వ తేదీ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. మిథిలా స్టేడియంలోని స్వామివారి కళ్యాణ మండపం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాల ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైతే CRPF బలగాలను వినియోగించుకోవాలని, వరంగల్, ఖమ్మం జిల్లా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.