AP TS Liquor Sales : ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు మందుబాబు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు. తమ జేబులు గుల్లచేసుకుని ప్రభుత్వాల ఖజానా నింపే ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. ఆరు రోజుల్లో రూ.1111.29 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ ప్రకటించింది. డిసెంబరు 30న అత్యధికంగా రూ.254 కోట్లు, 31న రూ.216 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని తెలిపింది. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ షాపులు, వైన్స్‌కి అనుమతి ఇవ్వడం, బార్‌లకు ఒంటి గంట వరకు ఓపెన్ ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. దీంతో ఒక్క హైదరాబాద్‌లోనే మద్యం ప్రియులు  24 గంటల్లో 37.68 కోట్ల రూపాయల మద్యం తాగినట్లు తెలుస్తోంది.  ఏపీలో డిసెంబర్ 31న మందు అమ్మకాలు జోరుగా సాగాయి.  డిసెంబర్‌ 31న ఏపీలో మొత్తం రూ.127 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. ఏపీలో కూడా మద్యం దుకాణాలకు రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.  


తెలంగాణలో మద్యం రికార్డులు 


తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.  2022లో మద్యంపై రూ.34 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఆబ్కారీ శాఖ తెలిపింది.  జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.34 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా టాప్ లో ఉంది. రెండో ప్లేస్ లో హైదరాబాద్ ఉండగా మూడో ప్లేస్ లో నల్లగొండ జిల్లా ఉంది.  మద్యం అమ్మకాలు ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన  2014–15లో రూ. 10.88 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.  2018–19లో ఇది రూ.20.85 వేల కోట్లకు పెరిగింది. అంటే ఐదేండ్లలో డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. 2020–21లో లిక్కర్ ఆమ్దానీ రూ.27.28 వేల కోట్లకు చేరుకుంది. ఈ సారి రూ.34 వేల కోట్లు వచ్చింది.


సగటున రూ.2500 కోట్ల ఆదాయం 


 2021–22లో సగటున నెలకు రూ.2,500 కోట్ల చొప్పున ఆదాయం వస్తే.. 2022 సగటున రూ.3 వేల కోట్లు సమకూరుతుంది. 2021 ఏప్రిల్‌‌‌‌ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 24వ తేదీ వరకు రూ.21,763 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేశారు. ఇందులో 2.65 కోట్ల ఇండియన్‌‌‌‌ మేడ్‌‌‌‌ లిక్కర్‌‌‌‌ (ఐఎంఎల్‌‌‌‌) కేసులు, 2.36 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 24 వరకు రూ.25,147 కోట్ల మద్యం సరఫరా కాగా, ఇందులో 2.52 కోట్ల ఐఎంఎల్‌‌‌‌ కేసులు, 3.48 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. 2021 పోలిస్తే ఈ సారి కోటి 12 లక్షల బీర్ కేసులు ఎక్కువగా అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది.