Krishna Water Disputes Tribunal AP Telangana:  దక్షిణ భారతదేశ రాజకీయ, ఆర్థిక ప్రగతిని దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న అంతరాష్ట్ర జలవివాదాల పరిష్కారానికి ఇప్పుడు ఒక అరుదైన, చారిత్రాత్మకమైన అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒకే రాజకీయ ఆలోచనా సరళితో ముందుకు సాగుతున్నారు.  మొండి పట్టుదలకు పోకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని ముగ్గురు నేతలు ప్రకటించారు.  ఇందులో భాగంగానే ప్రాథమిక అడుగుగా తుంగభద్ర బోర్డు పరిధిలోని సమస్యల పరిష్కారానికి తక్షణమే ఒక సమన్వయ కమిటీని వేసుకున్నారు. అయితే, ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రస్తుతం ఉన్న అదే సఖ్యత మూడ్‌లో మరికొన్ని దశాబ్దాల నాటి జల సమస్యలపై కూడా దృష్టి సారిస్తేనే దక్షిణాది ఐక్యత , సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. అసలైన సవాల్ ఆల్మట్టి

Continues below advertisement

ముగ్గురు సీఎంల సఖ్యతకు ఎదురవబోయే అతిపెద్ద పరీక్ష కర్ణాటకలోని కృష్ణా నదిపై ఉన్న  ఆల్మట్టి డ్యామ్  ఎత్తు పెంపు . కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్-2   తీర్పు ప్రకారం ఆల్మట్టి డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని 519.6 మీటర్ల నుండి 524.256 మీటర్లకు పెంచేందుకు కర్ణాటక గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే, ఆల్మట్టి ఎత్తు పెంచితే ఎగువన కర్ణాటకలోనే భారీగా నీరు నిల్వ ఉండిపోతుందని, దీనివల్ల దిగువన ఉన్న తెలంగాణ జూరాల, శ్రీశైలం , ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజ్  రాష్ట్రాలకు వచ్చే వరద నీరు గణనీయంగా తగ్గిపోతుందని రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కీలక అంశంపై ముగ్గురు సీఎంలు పరస్పర అవగాహనతో ఒక మధ్యేమార్గ ఫార్ములాను కనుగొనాల్సి ఉంది. 

 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిలోని వివాదాలు 

Continues below advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కృష్ణా జలాల పంపిణీ అంశం మరింత క్లిష్టంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్  ముందు వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదంలో కర్ణాటక కూడా ఒక ప్రధాన భాగస్వామిగా ఉంది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాల్లో తమకు రావలసిన వాటాపై స్పష్టత రావాలని తెలంగాణ కోరుతుండగా, ఏపీ తమ పాత హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మూడు రాష్ట్రాల సీఎంలు కోర్టులు, ట్రిబ్యునళ్ల చుట్టూ తిరగడం కంటే, ఒకచోట కూర్చుని పొలిటికల్ అండ్‌ టెక్నికల్ సెటిల్‌మెంట్ చేసుకుంటే ఈ దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.   తుంగభద్ర కాలువల ఆధునికీకరణ, సిల్ట్ సమస్య 

ఇటీవలే  నియమించిన తుంగభద్ర సమన్వయ కమిటీ ముందు తక్షణమే పరిష్కరించాల్సిన సవాళ్లు కొన్ని ఉన్నాయి. తుంగభద్ర జలాశయంలో భారీగా పేరుకుపోయిన పూడిక  కారణంగా డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం దాదాపు 30 టీఎంసీలకు పైగా తగ్గిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలనే కర్ణాటక ప్రతిపాదనపై ఏపీ, తెలంగాణలతో పూర్తి అవగాహన కుదరాల్సి ఉంది. ప్రాథమికంగా అంగీకారం తెలిపినట్లుగా చెబుతున్నారు.  అలాగే, తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల  ఆధునికీకరణ పనులు సకాలంలో జరగకపోవడం వల్ల ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి, తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలకు సకాలంలో నీరందడం లేదు. ముగ్గురు ముఖ్యమంత్రులు సంయుక్తంగా నిధులు కేటాయించి ఈ పనులను వేగవంతం చేయాల్సి ఉంది. 

 గోదావరి-కృష్ణా అనుసంధానం 

దక్షిణాది రాష్ట్రాల నీటి కొరతను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి అనుసంధాన ప్రాజెక్టు విజయవంతం కావాలన్నా ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల పాత్ర అత్యంత కీలకం. గోదావరిలో మిగులు జలాలను కృష్ణా బేసిన్‌కు, అక్కడి నుండి కర్ణాటక, తమిళనాడులకు తరలించే విషయంలో ఏపీ, తెలంగాణల అనుమతి తప్పనిసరి. తమ రాష్ట్రాల అవసరాలు తీరిన తర్వాతే నీటి తరలింపు జరగాలని తెలుగు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఈ విషయంలో ముగ్గురు సీఎంలు ఒకే తాటిపైకి వస్తే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జాతీయ ప్రాజెక్టుగా నిధులు సాధించవచ్చు.  రాజకీయంగా ఎవరి సిద్ధాంతాలు, ఎవరి ప్రాంతీయ ప్రయోజనాలు వారికి ఉన్నప్పటికీ.. ప్రకృతి ఇచ్చిన నీటి వనరుల పంపిణీ విషయంలో సఖ్యత ఉంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్రంలోని పాలకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, అంతర్గత జలవివాదాలను తామే స్వయంగా పరిష్కరించుకోగలమని ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు నిరూపిస్తే, అది దేశ రాజకీయాల్లోనే  దక్షిణాది ఐక్యత కు ఒక దిక్సూచిగా మారుతుంది.