Rains In AP and Telangana | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాగల 24 గంటల్లో వాతావరణం పూర్తిగా మారుతోంది. ఒకవైపు ఎండల తీవ్రత కొనసాగుతుండగానే.. మరోవైపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. బుధవారం నాడు (జూన్ 10న) అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం (మార్కాపురం), నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉండటంతో పాటు తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు.
వర్ష సూచన ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత తగ్గలేదు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లోని కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీతీవ్రమైన గాలులు, పిడుగుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షం పడే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపర్లు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, పాత భవనాల వద్ద నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో విస్తరిస్తున్న రుతుపవనాలు.. మూడు రోజులు భారీ వర్షాలుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ వేగంగా విస్తరిస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాలకూ పూర్తిగా విస్తరించడానికి వాతావరణం అనుకూలంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మూడు రోజులుపాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రుతుపవనాల ప్రభావంతో మొదలైన వర్షాల కారణంగా వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వీటితో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, కరీంనగర్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించారు.
రుతుపవనాల ప్రభావంతో జూన్ నెల 14వ తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. గత కొన్ని వారాలుగా భానుడి భగభగలు, సాధారణం కంటే ఎక్కువ నమోదైన ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తొలకరి జల్లులు ఉపశమనాన్ని కలిగించాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్న రైతుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
