Anchors in the middle of Congress vs BRS Politics: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న పోరు ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, సోషల్ మీడియా వార్ల స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సాగుతున్న ఈ డిజిటల్ దండయాత్ర లో తాజాగా సినీ తారల పేర్లు తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ వివాదానికి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు యాంకర్లకు కూడా గుర్తుండటం లేదని, రాష్ట్రంలో ఆయన ప్రభావం అంతంత మాత్రమేనని ఎద్దేవా చేస్తూ కేటీఆర్ మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, అషురెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యక్తిగత విమర్శలు ఒక్కసారిగా రాజకీయ సెగను పెంచేశాయి.
ఈ స్పందనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి సంబంధం లేని మహిళలను లాగడం, వారిని కించపరిచేలా పోస్టులు పెట్టడం కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనమని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నేరుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ వ్యవహారాన్ని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసింది.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని పదేపదే అవమానిస్తున్న బీఆర్ఎస్ నేతలకు తాము తగిన భాషలోనే సమాధానం చెబుతున్నామని కాంగ్రె్స సమర్థించుకుంటోంది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పంచాయతీ ఎటు దారితీస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తక్కువ చేసి చూపే ప్రయత్నంలో బీఆర్ఎస్, కేటీఆర్ వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నంలో కాంగ్రెస్ పోటాపోటీగా వ్యవహరిస్తుండటంతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది.
