A Householder Recieves 21 Crores Current Bill In Nagarkurnool: ఓ వినియోగదారునికి కరెంట్ బిల్ చూసి షాక్ తగిలింది. సాధారణ ఇంటికి రూ.21.47 కోట్ల కరెంట్ బిల్ రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీనిపై ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో జరిగింది. బిజినేపల్లి మండలం ఖానాపూర్‌కు చెందిన వేమారెడ్డికి ప్రతి నెలా రూ.వందల్లోనే బిల్లు వచ్చేది. ఈ క్రమంలో ఈ నెల 7న విద్యుత్ సిబ్బంది ఆయన ఇంటి మీటర్ స్కాన్ చేసి రూ.21,47,48,569 చెల్లించాలని బిల్లు చూశారు. దీన్ని చూసిన సదరు వినియోగదారుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీనిపై విద్యుత్ అధికారులను ఆశ్రయించాడు. అయితే, జీరో బిల్లింగ్ సమయంలో సాంకేతిక లోపంతోనే ఇలా జరిగిందని.. వినియోగదారుల ఫిర్యాదు మేరకు ఆ బిల్లులు సరి చేశామని ఏఈ మహేశ్ తెలిపారు. కాగా, లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్స్ అవగాహన లేని బయటి వ్యక్తులతో కరెంట్ బిల్లులు ఇప్పిస్తున్నారని స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారికి సరైన అవగాహన లేకనే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని.. రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.కోట్లలో వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కాగా, తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం 'గృహజ్యోతి' పథకం కింద 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. ఈ క్రమంలో 200 యూనిట్ల లోపు వాడితే వారికి జీరో బిల్లు జారీ చేస్తారు. పరిధిని దాటి వాడితే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్నిసార్లు ప్రైవేట్ వ్యక్తులతో బిల్లులు ఇప్పిస్తుండడం వల్ల అవగాహన లేక సాంకేతిక తప్పిదాలతో రూ.లక్షలు, రూ.కోట్లలో వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


Also Read: Health Checkups: రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య పరీక్షలు - ఆ వ్యాధులకు అట్టుకట్ట వేసేలా ఆరోగ్య శాఖ చర్యలు