ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పరిష్కారం కావాల్సిన అంశాలపై సంబంధిత మంత్రులు, అధికారులను కలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం కోసం ఆయన అపాయింట్ మెంట్ కోరగా, ఖరారు చేసి ఆ తర్వాత రద్దు చేశారు. శనివారం రాత్రి 10 గంటలు దాటాక మంత్రి కేటీఆర్‌కు అమిత్ షాను కలవడానికి తొలుత అపాయింట్ మెంట్ ఇచ్చారు. హైదరాబాద్‌లో రహదారుల విస్తరణకు కేంద్ర హోం శాఖ పరిధిలోని భూములు కోరడం సహా, విభజన చట్టంలోని పలు అంశాలపై మాట్లాడడానికి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ను కేటీఆర్‌ కోరారు.


అయితే, అమిత్ షా ఇతర ముఖ్య కార్యక్రమాల్లో బిజీగా ఉండడం, అప్పటికే బాగా పొద్దు పోయి సమయం దాటి పోవడం వల్ల కేటీఆర్ అపాయింట్ మెంట్ ని రద్దు చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కేటీఆర్ కు సమాచారం ఇచ్చారు. అమిత్ షా మణిపూర్‌ లోని అల్లర్ల విషయంలో అఖిలపక్ష భేటీతో పాటు తెలంగాణ బీజేపీకి నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో సమావేశం కావడం, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు చెందిన బీజేపీ లీడర్లతో వరుస మీటింగులు, ఇతర కార్యక్రమాల్లో అమిత్‌ షా నిన్న (జూన్ 24) పాల్గొన్నారు. ఇవేకాక ఇంకా కొన్ని ముఖ్య సమావేశాల ఉన్నందునే అపాయింట్‌మెంట్‌ రద్దు చేసినట్లు కేంద్ర హోం శాఖ అధికారులు కేటీఆర్‌కు సమాచారం అందించారు. దీంతో మంత్రి కేటీఆర్‌ నేడు (జూన్ 25) దిల్లీ నుంచి హైదరాబాద్‌ కి బయలుదేరనున్నారు.


హైదరాబాద్ కు బయల్దేరిన కేటీఆర్


మంత్రి కేటీఆర్‌, ఆయన బృందం ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు బయలుదేరింది. మంత్రి వెంట ఎంపీ రంజిత్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డితో కలిసి ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు.


హైదరాబాద్‌ పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాజ్ నాథ్ ను కేటీఆర్ కోరారు. హైదరాబాద్‌ మెట్రో రెండో దశ అనుమతి ఇవ్వడం సహా, ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు స్కైవేలు, ఫ్లై ఓవర్‌ నిర్మాణం జరిపడానికి ఆర్థిక పరంగా సాయం చేయాలని మంత్రి హర్‌దీప్‌సింగ్‌ కి విజ్ఞప్తి చేశారు. పట్టణాల్లో కార్మికుల సంఖ్య పెరుగుతున్నందున పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని కేటీఆర్ ప్రతిపాదించారు. మంత్రి పియూష్ గోయల్‌కు తెలంగాణ నుంచి అదనంగా 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలని కోరారు.


విపక్షాల విమర్శలు


తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే స్పందించారు. ఈ రోజు పాట్నాలో విపక్షాల సమావేశం జరుగుతుండగా... మరోవైపు ఢిల్లీ బీజేపీ మంత్రులతో బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నారని అన్నారు. ప్రతిపక్షాల సమావేశం రోజే బీజేపీ మంత్రులను మంత్రి కేటీఆర్ కలవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు మరికొంత మందిని మంత్రి కేటీఆర్ కలుస్తున్నారని ఫైర్ అయ్యారు.