దేశవ్యాప్తంగా ఫుల్ ఫిల్ సెంటర్ల విస్తరణలో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ తెలంగాణలో మరో ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే మేడ్చల్ లో ఉన్న ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ కు అదనంగా.. ఒక లక్ష చదరపు అడుగులతో మెుత్తంగా నాలుగు లక్షల చదరపు అడుగులతో స్టోరేజ్ కెపాసిటీ పెంచింది. పండగల సీజన్‌కు ముందు ఉత్పత్తులను నిల్వ చేయడానికి పెంచిన నిల్వ సామర్థ్యం ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.
ఈ నిర్ణయంతో కంపెనీ ఐదు ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లకు చేరుకుంటుంది. దీనితో తెలంగాణలో మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉన్న సంస్థగా అమెజాన్ అవతరించనుంది. అమెజాన్ మొత్తం నిల్వ సామర్థ్యం 5 మిలియన్ క్యూబిక్ అడుగులకు చేరనుంది.
ఈ విస్తరణతో అమెజాన్ కస్టమర్లకు లార్జ్ అప్లయేన్సస్, ఫర్నిచర్ విభాగంలో సరికొత్త అనుభూతిని అందిస్తోంది. రాష్ట్రంలోని చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు ఉపయోగపడుతుంది. ప్రస్తుత విస్తరణతో రాష్ట్రంలో అమెజాన్ ఫ్లోర్ ఏరియా 35 శాతం మేర, ఒవరాల్ స్టోరేజీ కెపాసిటీ 25 శాతానికి పెరుగుతుంది.
- అభినవ్, అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీస్ డైరక్టర్
తెలంగాణలో 35,000కుపైగా వినియోగదారులకు ఎఫ్‌సీ ఉపయోగపడుతుందని అమెజాన్ తెలిపింది. తెలంగాణలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది. ఫెస్టివల్ సీజన్ కారణంగా ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు, టెలివిజన్లు వంటి ఉత్పత్తులతో సహా ఫర్నిచర్ క్యాటగిరీని వేలాదిగా స్టోర్‌చేసి, కస్టమర్లకు డెలివరీ చేసేందుకు ఎఫ్‌సీ సదుపాయాల్ని విస్తరించినట్లు అమెజాన్ వెల్లడించింది.
రాష్ట్రంలో ఉన్న చిన్న, మధ్య తరగతి వర్గాలు చేపట్టే వ్యాపారాలకు ఉపయోగం ఉంటుందని అమెజాన్ ట్రాన్స్ పోర్టేషన్ సర్వీస్ డైరెక్టర్ అభినవ్ తెలిపారు. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న నగరాలు, పట్టణాలకు హైదరాబాద్ దగ్గరగా ఉండటం వలన అమెజాన్ మౌలిక సదుపాయాల విస్తరణకు వ్యూహాత్మక ప్రదేశంగా మారిందన్నారు.
తెలంగాణలో అమెజాన్ ఇండియా పెట్టుబడులు, బిజినెస్, ఇన్నోవేషన్ హబ్‌గా రాష్ట్రానికి ఉన్న ఆకర్షణకు నిదర్శనమని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.