గత ఐదు నెలలుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం చేసిన హుజూరాబాద్ ఉప ఎన్నికల సమరం నేడు జరగనుంది. ఇక ఈ ఉప ఎన్నిక కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 2,200 మంది రిజర్వ్ పోలీసులు ఉన్నారని తెలిపారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు కూడా పూర్తిస్థాయిలో చేశామని అన్నారు. ఇప్పటివరకూ 130 కేసులు వివిధ పార్టీలపై నమోదు చేశామని, మూడున్నర కోట్ల నగదు కూడా సీజ్ చేశామని తెలిపారు.
ప్రజలకు రూ.6 వేల నుండి రూ.10 వేల వరకు ఒక్కో ఓటుకు పంచుతున్నారని వచ్చిన వార్తలపై స్పందిస్తూ సెక్షన్ 171(బి)కింద డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం కూడా నేరం అని అన్నారు. డబ్బులు అడిగిన వారిపై అలాగే ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేశామని చెప్పారు. హరీష్ రావు బసచేసిన కిట్స్ కాలేజీ లో సైతం తనిఖీలు చేశామని అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దని, నియోజకవర్గంలోని 306 పోలింగ్ కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో ఎన్నికల మెటీరియల్ పంపిణీ చేశామని ఆయన తెలిపారు.
అక్రమాలు గుర్తిస్తే సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు
మరోవైపు ఏమైనా అక్రమాలు జరిగినట్లు ప్రజలు గుర్తిస్తే సి విజిల్ యాప్ ద్వారా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కడినుండైనా సమాచారం అందించవచ్చని, సదరు ఆరోపణలు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.
ఇక కోవిడ్ పేషెంట్లకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని వారు సాయంత్రం ఆరు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. వారికోసం అందుబాటులో పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, విజయవంతంగా ఈ ఉప ఎన్నికని పూర్తి చేస్తామని అన్నారు. ఎవరైనా కావాలని పోలింగ్ కేంద్రాల వద్ద గలాటా సృష్టిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఓటింగ్ ముగిసేవరకూ ప్రజలందరూ ఎన్నికల కమిషన్‌కి, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
హుజూరాబాద్ ఎన్నికల గణాంకాల విషయానికి వస్తే బరిలో నిలబడ్డ మొత్తం అభ్యర్థుల సంఖ్య 30. ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ముగ్గురు కాగా మిగతా వారు ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల వారు ఉన్నారు. హుజూరాబాద్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 37 వేల 22 మంది. పోలింగ్ కేంద్రాల సంఖ్య 306 కాగా ఎన్నికల సిబ్బంది 1715. నియోజకవర్గం మొత్తం ఉన్న సమస్యాత్మక ప్రాంతాలు 127 గా గుర్తించారు.
బద్వేలులోనూ అన్ని ఏర్పాట్లు
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక కూడా కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక్కడ కూడా శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు విజయరామ రాజు, రిటర్నింగ్ అధికారి, రాజంపేట సబ్ కలెక్టరు కేతన్‌గార్గ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సామగ్రితో పోలింగ్ సిబ్బంది ఆయా గ్రామాల్లో శుక్రవారం ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టరు దాసరి సుధ, బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పీఎం కమలమ్మతో పాటు మరో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,292 కాగా.. వారిలో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది, థర్డ్ జండర్ 22 మంది ఉన్నారు.