Addanki Dayakar :  తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. మీకున్న రాజకీయ తెలివి ఎంతో అర్థమవుతోంది. చార్టెడ్ అకౌంటెంట్ టు పొలిటికల్ లీడర్.. జగన్ కు సలహాదారుగా ఉన్నట్లు ఉండి.. పొలిటికల్ లీడర్ గా మారిన లెక్క ప్రభుత్వాలు మారవు మిత్రమా. వైఎస్ షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం అనేది మీకు నచ్చకపోవచ్చు. అందుకని కాంగ్రెస్ మీద అక్కసు వెళ్లబోసుకుంటున్నారేమో? రేపు రాజకీయంగా మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో అదే విధంగా కాంగ్రెస్ చెబుతుంది. కేసీఆర్ తో అంటకాగుతున్న మీరు.. మీ అక్కసు వెళ్లగక్కడం అనేది దేనికి సంకేతమో ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు 
 
రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను అద్దంకి దయాకర్ తీవ్రంగా ఖండించారు. విజయసాయిరెడ్డి విమర్శలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై మీకు ఇంత అక్కసు ఎందుకు? అంటూ ఎదురుదాడికి దిగారు. రాజకీయ అజ్ఞాని అంటూ విజయసాయిరెడ్డిపై మాటల దాడి చేశారు.  తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేయడం ప్రతొక్కరికి పరిపాటిగా మారింది. మొన్న ఒకరు, నిన్న ఒకరు, నేడు ఒకరు అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిలా కనిపించారు. ఆయన పెద్దల సభకు ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు? మోదీ ప్రాపకం పొందాలి అనుకుంటే, మోదీ దగ్గర మార్కులు ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే, ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడటమా అని ప్రశ్నించారు.  





 
 
 తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అక్కసు ఎందుకు విజయసాయిరెడ్డీ.. దివాలాకోరువా?.. మోదీ బానిసవా? అంటూ ఫైరయ్యారు. జగన్ ప్రభుత్వంపై మేం కూడా కామెంట్ చేయగలమని, షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ బలం పెరుగుతుందనే ఇంత అక్కసు వెల్లగక్కుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా?.. బానిసత్వంతో మోదీని జొకడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి సమస్యలు రాకుండా రేవంత్ చూసుకుంటారని దయాకర్ అన్నారు.         


ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని అన్నారు. కేసీఆర్ తో కలిసి వైసీపీ నేతలు తెలంగాణ సర్కార్ పై కుట్ర పన్నుతున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకే విజయసాయిరెడ్డిపై ఘాటుగా స్పందిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.