Adilabad News : ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆదివాసీపై అటవీ శాఖ అధికారులు దాడి చేశారు. అడవిలో  కట్టేలకు కోసం వెళ్లిన నాగల్ కొండ గ్రామానికి చెందిన కోవ లింబరావ్ (55) అనే ఆదివాసిపై అటవీశాఖ అధికారులు తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడ్ని స్థానికులు ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆదివాసిపై అటవీశాఖ అధికారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నాగల్ కొండ గ్రామస్తులు ఉట్నూర్ అటవీ డివిజల్ అధికారి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.


అసలే జరిగింది? 


ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండ గ్రామానికి చెందిన కోవా లింభారావు అనే ఆదివాసీ.. సమీపంలోని అడవిలోకి  కట్టెల కోసం వెళ్లగా.. అటువైపుగా వెళ్తున్న అటవీ శాఖ సిబ్బంది అతడిని తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అటవీశాఖ అధికారుల దాడిలో గాయపడ్డ అతన్ని గమనించిన స్థానికులు.. అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుగా కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి అతడిని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ లింబరావుకు ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం లింబరావ్ ను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించి అతనికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా తలకు,  ఊపిరితిత్తుల్లో, నడుంపై తీవ్రంగా గాయలున్నట్లు గుర్తించారు. అతడికి మరింత మెరుగైన వైద్యం అందించాలంటే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.


ఆదివాసీపై అటవీశాఖ అధికారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నాగల్ కోండ గ్రామస్తులు ఉట్నూర్ అటవీ డివిజనల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలే అడవిని కాపాడుతున్నారని, అసలు అడవిని దోచుకుని కలపను స్మగ్లింగ్ చేసేది అటవీశాఖ అధికారులేనని, అటవీశాఖ అధికారుల కనుసన్నలలోనే స్మగ్లింగ్ జరుగుతుందని ఆరోపించారు. వంటగ్యాస్ ధరలు అధికం కావడంతో కట్టెల కోసం అడవికి వెళ్ళిన ఆదివాసి లింబారావ్ ను అటవీశాఖ అధికారులు బూతులు తిడుతూ అతన్ని తీవ్రంగా కొట్టి గాయపర్చారని ఆందోళన చేపట్టారు. 


అమాయక ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం స్థానిక అటవీ శాఖ కార్యాలయం ముందు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఉట్నూర్ అటవీ డివిజనల్ అధికారి కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఆదిలాబాద్ ఆసిఫాబాద్‌ జిల్లాల తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్, కొట్నాక్ విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్కబాపురావ్, మహిళ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందూర్ పుష్పరాణిల ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దాడి చేసిన అటవీ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవుల్లో జీవిస్తున్న ఆదివాసులు అడవులను రక్షిస్తున్నారని, అటవీ శాఖ అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. అడవులు నరికే వారికి మేము పూర్తిగా వ్యతిరేకులమని, కానీ అడవుల రక్షణ పేరుతో ఆదివాసులపై దాడులు చేసే వారి పట్ల తీవ్రంగా పరిగణిస్తామని, అలాంటి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడిలో గాయపడ్డ బాధిత కుటుంబంలో ఒకరికి అటవిశాఖలో ఉద్యోగంతో పాటు లింబారావుకు మెరుగైన వైద్యం అందించాలని, నిరుపేదైన వారికి బతుకు దెరువు కోసం ఆయన కుటుంబానికి వ్యవసాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.