Adilabad News: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మ‌ల్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా అన్ని వసతులను సమకూర్చామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బుధ‌వారం నిర్మ‌ల్ జిల్లా ప్రధాన‌ ప్ర‌భుత్వ‌ ఆస్ప‌త్రిలో రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్ ను మంత్రి ప్రారంభించారు. సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు విఠ‌ల్ రెడ్డి, రేఖా నాయ‌క్, టీఎస్‌ఐడీసీ చైర్మ‌న్ వేణుగోపాల‌ చారి, క‌లెక్ట‌ర్ వ‌రుణ్ రెడ్డి, జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ విజ‌య‌ ల‌క్ష్మి రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.



ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... పేదరికం కారణంగా చాలా మంది ప్రజలు ఖరీదైన వైద్యానికి దూరమవుతున్నార‌ని, అలాంటి వారి కష్టాలను తీర్చడానికే నిర్మ‌ల్ జిల్లా ప్ర‌ధాన‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయించామని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటుతో పేద ప్రజలకు ఆర్థిక భారంతో పాటు దూర భారం త‌గ్గింద‌ని తెలిపారు. నిర్మ‌ల్ జిల్లా ఆసుప‌త్రుల్లో పడకల సంఖ్య పెంచుకోవ‌డం జరిగిందని, మాతా శిశు సంరక్షణ కోసం చేప‌ట్టిన చ‌ర్య‌ల వ‌ల్ల‌ సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగిందని వివరించారు. అలాగే సర్జరీలు, సీజెరీయన్లు, సీ సెక్షన్లను పూర్తిగా తగ్గించగలిగామని పేర్కొన్నారు.  డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా వివిధ వ్యాధుల నిర్ధారణ పరీక్షల సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని  స్పష్టం చేశారు. 


166 కోట్ల రూపాయలతో వైద్య కళాశాల ఏర్పాటు


రూ. 42 కోట్ల‌తో జిల్లా ప్ర‌భుత్వ ప్ర‌ధాన ఆసుప‌త్రి భ‌వ‌న స‌ముదాయ‌న్ని నిర్మిస్తున్నామ‌ని, అదే విధంగా వైద్య క‌ళాశాల ఏర్పాటుకు రూ.166 కోట్లు మంజూర‌ు అయ్యాయ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే టెండ‌ర్లు పిలిచి, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వైద్య క‌ళాశాల భ‌వ‌న‌ నిర్మాణానికి  శంఖుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. దీంతో పాటు రూ. 30 కోట్ల‌తో నిర్మించిన‌ మైనార్టీ రెసిడెన్షియ‌ల్ స్కూల్, నిర్మ‌ల్ మున్సిపాలిటీ ప‌రిధిలో 2వేల డ‌బుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నామ‌ని, వాటిలో 1200 ఇండ్ల నిర్మాణం పూర్తి కావ‌చ్చింద‌ని, వీటిని కూడా సిఎం చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు.


 మంత్రి హరీష్ రావు పర్యటన రద్దు


మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన రద్దు అయింది. ముందుగా సిటీ స్కానింగ్ సేవలను ప్రారంభించేందుకు మంత్రి హరీష్ రావు ఇక్కడకు వస్తారని అంతా భావించారు. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకూడదని పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముందస్తుగా పలువురు ప్రతిపక్షాలు, ఆదివాసీ సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పలు కారణాల వల్ల మంత్రి హరీష్ రావు రాలేకపోయారు. ఈ క్రమంలోనే మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి నిర్మల్ లో సిటి స్కానింగ్ సేవలను ప్రారంభించారు.