lagacharla incident Accused Suresh Surrendered in police station | వికారాబాద్: లగచర్లలో అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వారం రోజుల నుంచి ముప్పుతిప్పలు పెట్టిన కీలక నిందితుడు బోగమోని సురేశ్‌ ఎట్టకేలకు లొంగిపోయాడు. లగచర్ల దాడి కేసులో ఏ2గా ఉన్న సురేశ్‌ను పోలీసులు మంగళవారం నాడు కొడంగల్‌ కోర్టులో హాజరు పరిచారు. కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులపై జరిగిన దాడి కేసులో గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్న సురేష్ కేసు తీవ్రత పెరగడంతో ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. మంగళవారం ఉదయం నిందితుడు బోగమోని సురేశ్ పోలీసుల ఎదుట ప్రత్యక్షం కావడంతో వారు సైతం ఆశ్చర్యపోయారు.


నిందితుడికి రెండు వారాల రిమాండ్
సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లోని లగచర్లలో కలెక్టర్‌ బృందాన్ని ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద నుంచి గ్రామంలోకి తీసుకెళ్లిన కీలక వ్యక్తి సురేష్. అధికారులు గ్రామంలోకి వెళ్లగానే వెంటనే ఆందోళనకారులు పెత్త ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు దూసుకువచ్చారు. అదే అదనుగా భావించి నిందితుడు సురేశ్‌ సైతం నినాదాలు చేసినట్లు వీడియోల్లో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అంటే అధికారులపై దాడి చేయాలన్న పక్కా ప్లాన్ తోనే కలెక్టర్ సహా అధికారులను సురేష్ గ్రామంలోకి తీసుకెళ్లాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తాజాగా లొంగిపోయిన నిందితుడు సురేష్ ను కొడంగల్ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టగా రెండు వారాల రిమాండ్ విధించారు. 


సురేష్‌తో పాటు అరెస్ట్ చేసిన మరో ఇద్దరిని కోర్టులో హాజరు పరిచిన పోలీసుల కోర్టులో విచారణ ముగిసిన అనంతరం కోడంగల్ నుంచి ముగ్గురు నిందితులను సంగారెడ్డి జైలుకు తరలించనున్నారు. ఏ1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. ఏ2 సురేష్ ను సైతం తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.


Also Read: Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌


 రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు!
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర జరిగిందని లగచర్లలో అధికారులపై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈ దాడి వెనుక కేటీఆర్ ఉన్నారని, కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు బీఆర్ఎస్ చేసిన భారీ కుట్ర అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ముందుగానే అధికారులపై దాడికి ప్లాన్ చేశారని, సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి రెగ్యూలర్ గా ఫోన్లు చేస్తూ టచ్ లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా, తనను ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని తాను ముందే చెప్పానని కేటీఆర్ పేర్కొన్నారు. దీపావళి పండుగ నాడు సైతం అధికారులు, పోలీసులు ఎప్పుడు వచ్చినా, తాను ఎక్కడికి పోలేదని అక్రమ అరెస్టులకు సిద్ధమని కేటీఆర్ చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అరెస్ట్ చేస్తారేమోనని కేటీఆర్ విదేశాలకు సైతం పారిపోయే అవకాశం ఉందని కొన్ని సోషల్ మీడియా పేజీల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. దొంగ కేసులకు, అక్రమ అరెస్టులకు భయపడే రకం తాను కాదని, పోరాటేతత్వం తమ పార్టీదన్నారు. లగచర్ల బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్, హరీష్ రావు హామీ ఇచ్చారు.


Also Read: Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు