Smartphone Charger White in Colour: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన గాడ్జెట్‌గా మారింది. దాదాపు అన్ని కంపెనీల ఛార్జర్‌లు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయని మీరు గమనించే ఉంటారు. చాలా తక్కువ కంపెనీ బ్రాండ్‌లు మాత్రమే నలుపు లేదా ఇతర రంగు ఛార్జర్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్ ఛార్జర్లు ఎక్కువగా తెలుపు రంగులో ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్న కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది దాదాపు ఎవరికీ తెలియదు.
తెలుపు రంగును ఎందుకు ఎంచుకుంటారు?
స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఛార్జర్‌ను తెలుపు రంగులో తయారు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. తెలుపు రంగు శుభ్రంగా, ప్రీమియం రూపాన్ని ఇస్తుందని కంపెనీలు నమ్ముతాయి. తెలుపు రంగు దూరం నుండి కొత్తగా, బెటర్‌గా కనిపిస్తుంది. ఇది వినియోగదారులపై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆపిల్ వంటి కంపెనీలు తమ ఛార్జర్‌లు, కేబుల్‌లను ఎప్పుడూ తెలుపు రంగులోనే ఉంచుతాయి.
మురికి, డ్యామేజీ త్వరగా కనిపిస్తాయి
తెలుపు రంగుపై కొద్దిగా మురికి, గీతలు లేదా కాలిన గుర్తులు ఉన్నా మనకు వెంటనే కనిపిస్తాయి. దీని వలన ఛార్జర్ చెడిపోతోందని లేదా ఏదైనా సమస్య ఉందని వినియోగదారులకు ఈజీగా తెలుస్తుంది. ఇది ఒక రకమైన భద్రతా సంకేతం కూడా అని కంపెనీలు భావిస్తాయి. నలుపు లేదా ముదురు రంగు ఛార్జర్‌లలో మురికి దాగి ఉంటుంది. దాంతో వైర్లు డ్యామేజీ అయినా, ఏదైనా కాలిపోయినట్లు ఉన్నా వినియోగదారులు ఆ ఛార్జర్లు వాడితే ప్రమాదాన్ని ముందుగా గుర్తించలేరు.
ఉత్పత్తి, ఖర్చులో సౌలభ్యం
తెలుపు రంగు ప్లాస్టిక్‌ను తయారు చేయడం కంపెనీలకు చాలా సులువు, ఈ ప్రాసెస్ చౌకగా ఉంటుంది. ఛార్జర్‌లను తయారు చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ తెలుపు రంగులో సులభంగా అచ్చు వేయవచ్చు. దీనికి అదనపు రంగులు వేయాల్సిన అవసరం లేదు. అందుకే తెలుపు ఛార్జర్లను పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయడం తేలిక, ఈ విధానం కంపెనీలకు చవకగా ఉంటుంది.
తెలుపు రంగు, హీట్ మేనేజ్‌మెంట్
ఛార్జింగ్ సమయంలో ఛార్జర్‌లో కచ్చితంగా వేడి ఉత్పత్తి అవుతుంది. తెలుపు రంగు వేడిని ఎక్కువగా గ్రహించదు. అయితే నలుపు లేదా ముదురు రంగు ఉత్పత్తులు వేడిని త్వరగా గ్రహిస్తాయి. అందుకే ఛార్జర్‌ను చల్లగా ఉంచడానికి తెలుపు రంగు సహాయపడుతుంది. దాంతోపాటు ఛార్జర్ లైఫ్ టైమ్ పెంచుతుంది.
బ్రాండింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీ
తెలుపు రంగు శాంతి, సరళత, నమ్మకానికి చిహ్నంగా పరిగణిస్తారు. కంపెనీలు దీనిని తమ బ్రాండింగ్‌లో భాగంగా చేసుకోవడానికి ఇది ఒక కారణం. ముఖ్యంగా ఆపిల్ తెలుపు ఛార్జర్‌లు, కేబుల్‌లను ఒక రకమైన ప్రమాణంగా తీసుకుని తయారుచేస్తుంది. ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ఈ విధానాన్ని అనుసరించాయి, తద్వారా వారి ఉత్పత్తి మరింత ఆకర్షణీయంగా, యూజర్లకు నమ్మదగినదిగా కనిపిస్తుందని కంపెనీలు భావిస్తాయి.
నలుపు రంగు, ముదురు రంగు ఛార్జర్‌లు మంచిది కాదా?
నలుపు లేదా ఇతర రంగు ఛార్జర్‌లు మంచివి కావని కాదు. కానీ వినియోగదారులకు ప్రీమియం, చాలా బ్రాండ్‌లు ఇప్పుడు వివిధ రంగుల ఛార్జర్‌లను కూడా విడుదల చేస్తున్నాయి. చాలా కంపెనీలు ఇప్పటికీ తెలుపు రంగుకే ప్రాధాన్యతనిస్తున్నాయి. ఎందుకంటే ఇది చవకైనది, ఈజీగా చేయవచ్చు. వినియోగదారులు చార్జర్ డ్యామేజీని ఈజీగా గుర్తించవచ్చు. వేడిని తక్కువగా గ్రహిస్తుందని తెలుగు రంగు ఛార్జర్స్ ను యూనివర్సల్‌గా పరిగణిస్తున్నారు.