WhatsApp Translation Feature | మెస్సేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇకపై ఏ భాషలోనైనా వచ్చిన మెసేజ్‌లను చదవడం, అర్థం చేసుకోవడం యూజర్లకు సులభం కానుంది. వాస్తవానికి కంపెనీ మెసేజ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ (Message Translation Feature)ను తీసుకువస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న Android, ఐఫోన్ (iPhone) వినియోగదారులు ఈ ఫీచర్ ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ వినియోగదారులు ఛానల్ అప్‌డేట్‌లు, గ్రూప్ సంభాషణలు, వన్-టు-వన్ చాట్ (వ్యక్తిగత ఛాటింగ్)లలో వచ్చిన సందేశాలను అనువాదం చేసుకోగలరని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ వినియోగదారుల గోప్యతను పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటుందని, అనువాద ప్రక్రియ మొత్తం వినియోగదారుల డివైజ్‌లోనే ఉంటుందని, కంపెనీ కూడా దీన్ని చూడలేదని WhatsApp పేర్కొంది.
ఫీచర్‌పై వాట్సాప్ హర్షం
వాట్సాప్ అందుబాటులోకి తెస్తున్న మెస్సేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ భాషా పరమైన సమస్యలను తొలగించి ప్రజలు మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి, అవతలి వ్యక్తితో సంభాషించడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నామని WhatsApp తాజా ప్రకటనలో తెలిపింది. ఈ ఫీచర్ వినియోగించాలనుకునే యూజర్లు మీ ఫోన్లో యాప్‌ను అప్‌డేట్ చేయాలని కోరారు.
ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?
మెస్సేజ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. ఏదైనా సందేశాన్ని అనువదించడానికి, దానిపై ఎక్కువసేపు ప్రెస్ చేయండి. ఆ తర్వాత, అనువాదం (Translation) ఎంపిక వస్తుంది. ఈ ఎంపికలో వినియోగదారులు తమకు నచ్చిన భాషను సెలక్ట్ చేసుకోవచ్చు. మొదటిసారి ఉపయోగిస్తున్నప్పుడు వారు భాషను డౌన్‌లోడ్ సైతం చేసుకోవాలని సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 3 బిలియన్లకు పైగా వినియోగదారులు మెస్సేజ్‌లు ఇబ్బంది లేకుండా అర్థం చేసుకోవడానికి ఈ ఫీచర్‌ను విడుదల చేయడానికి కంపెనీ చర్యలు తీసుకుంది.
ఏయే భాషలు సపోర్ట్ చేస్తుంది
ఈ వాట్సాప్ మెస్సేజ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ దశలవారీగా విడుదల చేయనున్నారు. ప్రారంభంలో Android ఫోన్‌లలో ఈ ఫీచర్‌ను ఇంగ్లీష్, హిందీ, స్పానిష్,పోర్చుగీస్, రష్యన్, అరబిక్ భాషలను సపోర్ట్ చేస్తుంది. తరువాత దశలవారీగా ఇతర భాషలను కూడా ఇందులో చేర్చుతారు. అదే సమయంలో iPhone 19 భాషలను సపోర్ట్ చేస్తుంది. ఆ భాషలలో వచ్చే మెస్సేజ్‌లను మీకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్‌లేట్ చేసి ఇస్తుంది. Android ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఫీచర్‌ను మెరుగు చేయడానిక అదనపు ఎంపిక ఇవ్వనున్నారు. ఇందులో వినియోగదారులు తమ ఇష్టం ప్రకారం ఏదైనా చాట్‌లో ఆటోమేటిక్ అనువాదాన్ని చేయగలరు. ఆ తర్వాత, ఆ చాట్‌లో వచ్చే అన్ని సందేశాలు అనువాదం అవుతాయి. వాటిని మీరు మాన్యువల్‌గా ట్రాన్స్‌లేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.