DNA Data Storage: ప్రతిరోజూ మనం వేలాది ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు  వినియోగిస్తున్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇది మరింతగా పెరిగిపోయింది. ఈ డిజిటల్ యుగంలో డేటా వేగంగా పెరుగుతోంది. రోజుకు 330 మిలియన్ టెరాబైట్స్ కంటే ఎక్కువ డేటా ప్రపంచవ్యాప్తంగా తయారవుతోంది. 2025 చివరి నాటికి మొత్తం ప్రపంచ డేటా 175 జెట్టాబైట్లకు చేరుకుంటుందని ఓ అంచనా. అయితే ఈ అపారమైన డేటాను ఎక్కడ భద్రపరుస్తాం? సాధారణ హార్డ్ డిస్కులు, డేటా సెంటర్లు ఈ డేటాకు తగ్గట్టుగా ఏర్పాటు కావడం లేదు. అందుకే దీనికి శాస్త్రవేత్తలు కనిపెట్టిన పరిష్కారమే DNA డేటా స్టోరేజ్.

Continues below advertisement

DNA అంటే ఏమిటి? ఎందుకు డేటా స్టోరేజ్‌కి పర్ఫెక్ట్?

DNA (డీఆక్సిరైబో న్యూక్లియిక్ ఆసిడ్) అంటే మన జన్యు సమాచారాన్ని నిల్వ చేసే అణువు. 1953లో జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ దీని డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని కనుగొన్నారు. DNAలో నాలుగు మూలకాలు ఉంటాయి- A (అడెనైన్), T (థైమిన్), C (సైటోసిన్), G (గ్వానైన్). ఇవే DNA "అక్షరాలు" అని చెప్పవచ్చు. సాధారణ కంప్యూటర్లు 0, 1 అనే రెండు నంబర్లతో పనిచేస్తాయి. అదేవిధంగా DNA కూడా కోడింగ్ సిస్టం కూడా A, T, C, G అనే నాలుగు లెటర్స్‌తో సమాచారాన్ని నిల్వ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ గ్రూప్ ప్రకారం, "డిజిటల్ సమాచారం 0s&1s పై ఆధారపడి ఉంటే, DNA కూడా అలానే పనిచేస్తుంది".

కంప్యూటర్ కోడ్ నుంచి DNA వరకు ఎలా పనిచేస్తుంది? 

కంప్యూటర్ ఫైల్‌లను DNAలో నిల్వ చేయడం ఆరు దశలు ఇమిడి ఉంటాయి. 

Continues below advertisement

మొదటి దశ - కోడింగ్: మన డిజిటల్ ఫైల్‌లలోని 0s&1s ను DNAకి చెందిన A, T, C, G లేటర్స్‌గా మారుస్తారు.  

రెండో దశ - సింథసిస్: బయోలాజికల్ రియాక్షన్లు ఉపయోగించి చిన్న DNA పార్ట్‌లను తయారుచేసి, వాటిని పెద్ద స్ట్రాండ్స్‌గా కలుపుతారు.

మూడో దశ - స్టోరేజ్: DNAను వైయల్స్‌లో ఇనర్ట్ సొల్యూషన్‌లో లేదా సాలిడ్ రూపంలో భద్రపరుస్తారు.

నాలుగో దశ - రిట్రీవల్: ఈ DNA శాంపిల్ నుంచి అవసరమైన భాగాలను వేరుచేస్తారు. కోవిడ్ టెస్టింగ్‌లో వాడే PCR యాంప్లిఫికేషన్ టెక్నిక్‌ను ఉపయోగిస్తారు.

ఐదో దశ - సీక్వెన్సింగ్: DNA నుక్లియోటైడ్ బేస్ పెయిర్స్‌ను రీడ్ చేస్తారు.

ఆరో దశ - డీకోడింగ్: బేస్ పెయిర్ సీక్వెన్స్‌ను తిరిగి బైనరీ స్ట్రీమ్‌గా మార్చి, డేటా సెగ్మెంట్స్‌ను రీఅసెంబుల్ చేస్తారు.

అద్భుతమైన స్టోరేజ్ సామర్థ్యం

DNA స్టోరేజ్ సామర్థ్యం గురించి తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఒక గ్రామ్‌ DNAలో 215 పెటాబైట్స్ డేటా నిల్వ చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ప్రకారం, DNA అత్యంత థిక్‌ స్టోరేజ్ మీడియం. ఒక క్యూబిక్ మిల్లీమీటర్‌లో దాదాపు ఒక ఎక్సాబైట్ డేటా నిల్వ చేయవచ్చు. ఇంటర్నెట్‌లోని మొత్తం సమాచారాన్ని ఒక క్యూబిక్ ఇంచ్ కంటే చిన్న పరికరంలో నిల్వ చేయవచ్చు.

హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మార్క్ బాత్ చెప్పినట్లుగా,"DNA ఫ్లాష్ మెమరీ కంటే వేయి రెట్లు థిక్‌. ఒకసారి DNA పాలిమర్ తయారైంది అనుకుంటే, దానికి ఎలాంటి ఎనర్జీ అవసరం లేదు". Facebook మొత్తం డేటాను గసగసాల గింజ సైజులో నిల్వ చేయవచ్చు. ప్రపంచంలోని మొత్తం డేటాను ఒక కాఫీ కప్పులో భద్రపరచవచ్చు.

దీర్ఘకాలిక భద్రత 

DNA స్టోరేజ్‌లో అతి ముఖ్యమైన లక్షణం దాని దీర్ఘకాలికంగా భద్రపరచవచ్చు. సరైన పరిస్థితుల్లో భద్రపరిస్తే DNA వేలాది సంవత్సరాలు అలానే ఉంటుంది. DNA ఎప్పుడూ పాడైపోదు. కూల్ అండ్ డ్రై ప్లేస్‌లో ఉంచితే వందల వేల సంవత్సరాలు ఫైల్స్ భద్రంగా ఉంటాయి.

రీసెర్చ్ చేస్తున్న కంపెనీలు

మైక్రోసాఫ్ట్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కలిసి పూర్తిగా ఆటోమేటిక్ DNA-బేస్డ్ డేటా స్టోరేజ్,  రిట్రీవల్ సిస్టమ్‌ను తీసుకొచ్చాయి. 2020లో మైక్రోసాఫ్ట్ DNA డేటా స్టోరేజ్ అలయన్స్‌ను ఏర్పాటు చేసింది. దీనిలో ట్విస్ట్ బయోసైన్స్, ఇల్యుమినా, వెస్టర్న్ డిజిటల్ వంటి కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి.

DNA డేటా స్టోరేజ్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా DNA డేటా స్టోరేజ్ మార్కెట్ విలువ 74 మిలియన్ డాలర్లుగా ఉంది. 2024 చివరి నాటికి 123.95 మిలియన్ డాలర్లకుపైగా అయ్యింది. 2030 నాటికి 3.34 బిలియన్ డాలర్లు చేరుకుంటుందని అంచనా ఉంది. 

DNA స్టోరేజ్ ముఖ్యంగా లాంగ్-టర్మ్ డేటా భద్రపరచడానికి అనువుగా ఉంటుంది. సర్వైలెన్స్ వీడియోలు, బ్యాంక్ ట్రాన్జాక్షన్లు, మెడికల్, సైంటిఫిక్ డేటా వంటివి దీర్ఘకాలికంగా భద్రపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటికి ఇది యూజ్ అవుతుంది. 

శాస్త్రవేత్తలు వైవిధ్యమైన డేటా రకాలను DNAలో నిల్వ చేయడంలో విజయం సాధించారు. మార్టిన్ లూథర్ కింగ్ "ఐ హ్యావ్ ఎ డ్రీం" ప్రసంగం, షేక్స్‌పియర్ సానెట్లు, GIF యానిమేషన్లు, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటివి DNAలో ఎన్కోడ్ చేశారు.

పర్యావరణ ప్రయోజనాలు

DNA స్టోరేజ్ పర్యావరణపరంగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఫుట్‌బాల్ మైదానం సైజులో ఉన్న డేటా స్టోరేజ్ సర్వర్ పార్కును కేవలం ఫుట్‌బాల్ సైజులోని DNA స్టోరేజ్ సర్వర్‌తో భర్తీ చేయవచ్చు. DNA మెయింటెనెన్స్ అవసరం లేదు. ఫైల్స్ కాపీ చేయడం ఈజీ అవుతుంది.  

సవాళ్లు  

అయితే DNA డేటా స్టోరేజ్‌కు ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఉన్నాయి:

అధిక ఖర్చు: ప్రస్తుతం ఒక మెగాబైట్ డేటాను DNAలో రాయడానికి 3,500 డాలర్లు ఖర్చవుతుంది. మాగ్నెటిక్ టేప్‌తో పోటీపడడానికి DNA సింథసిస్ కాస్ట్ గణనీయంగా తగ్గాలి.

స్లో ప్రాసెసింగ్: DNA సింథసిస్ , సీక్వెన్సింగ్ ప్రక్రియలు నెమ్మదిగా ఉన్నాయి. ఇది మరింత వేగంగా జరగాలి.  

ఎర్రర్ రేట్: DNA సింథసిస్, సీక్వెన్సింగ్‌లో ఎర్రర్లు ఎక్కువగా వస్తున్నాయి.  

బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో అడ్వాన్స్‌మెంట్స్ వల్ల DNA సింథసిస్, సీక్వెన్సింగ్ టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కొంతమంది టెక్ ఎక్స్‌పర్ట్లు DNA స్టోరేజ్ ఐదేళ్లలో వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. రీసెర్చర్లు DNA స్టోరేజ్ ధరలు రెండు దశాబ్దాలలో మాగ్నెటిక్ టేప్‌తో పోటీపడే స్థాయికి తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.  

DNA డేటా స్టోరేజ్ టెక్నాలజీ మన డిజిటల్ భవిష్యత్తును మార్చే సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుత సవాళ్లను అధిగమించి, ఖర్చు తగ్గితే, ఈ టెక్నాలజీ డేటా స్టోరేజ్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ధాన్యం రేణువు సైజులో ప్రపంచపు డేటాను నిల్వ చేసే కల సాకారం అవుతుంది. భవిష్యత్తులో మన అందరి జీవితాలలోని అమూల్యమైన జ్ఞాపకాలు, చిత్రాలు, వీడియోలు అన్నీ ఒక చిన్న DNA చిప్పులో భద్రంగా వేలాది సంవత్సరాలు నిల్వ చేసుకోవచ్చు.