VLC Media Player Ban: వీఎల్‌సీ(VLC) మీడియా ప్లేయర్‌లో భారత్‌లో బ్యాన్ అయింది. వీడియో లాన్ ప్రాజెక్ట్ ద్వారా అభివృద్ధి చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా ప్లేయర్ సాఫ్ట్‌వేర్, స్ట్రీమింగ్ మీడియా సర్వర్ ఇది. మీడియా నామా ప్రకారం.. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ భారతదేశంలో నిషేధించినట్టు పేర్కొంది. అయితే ఇది దాదాపు 2 నెలల క్రితం జరిగింది. అయితే ఇప్పటికే మీరు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే అది ఇప్పటికీ పని చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా నిషేధం గురించి కంపెనీ లేదా భారత ప్రభుత్వం ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.
సైబర్ దాడుల కోసం చైనా మద్దతు ఉన్న హ్యాకింగ్ గ్రూప్ సికాడా(Cicada) ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించినందున వీఎల్‌సీ మీడియా ప్లేయర్ దేశంలో నిషేధించినట్టు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. హానికరమైన మాల్వేర్ లోడర్‌ను అమలు చేయడానికి సికాడా వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ని ఉపయోగిస్తోందని కొన్ని నెలల క్రితం భద్రతా నిపుణులు కనుగొన్నారు.
ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి, మీడియా ప్లాట్‌ఫారమ్‌ను నిషేధిస్తున్నట్లు కంపెనీ గానీ భారత ప్రభుత్వం గానీ అధికారికంగా ప్రకటించ లేదు. దీనికి సంబంధించిన కొన్ని రిస్ట్రక్షన్‌ను కొంతమంది ట్విట్టర్ యూజర్లు గమనించారు. వీఎల్‌సీ వెబ్‌సైట్ నిషేధానికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను ట్వీట్ చేస్తున్నారు. "ఐటి యాక్ట్, 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్డర్స్ ప్రకారం వెబ్‌సైట్ నిషేధించినట్టు అందులో రాసి ఉంది.
ప్రస్తుతం వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్‌సైట్, డౌన్‌లోడ్ లింక్ దేశంలో నిషేధించారు. దేశంలో ఎవరూ ఏ పని కోసం కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయలేరు. యాక్ట్ ఫైబర్‌నెట్, జియో, వొడాఫోన్ ఐడియా సహా ఇతర అన్ని ప్రధాన ఐఎస్‌పీలలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్ నిషేధించినట్టు చెబుతున్నారు.
2020లో భారత ప్రభుత్వం పబ్‌జీ మొబైల్, టిక్‌టాక్, కామ్‌స్కానర్ సహా వందలాది చైనీస్ యాప్‌లను నిషేధించింది. నిజానికి బీజీఎంఐ అని పిలిచే పబ్‌జీ మొబైల్ ఇండియన్ వెర్షన్ ఇటీవల భారత్‌లో నిషేధించారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తీసేశారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారుల డేటాను చైనాకు పంపుతున్నాయని భావించి ఈ యాప్‌లను బ్లాక్ చేసింది. అయితే వీఎల్‌సీ మీడియా ప్లేయర్ ప్యారిస్‌కు చెందిన వీడియోలాన్ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది.