వివో మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్‌కి సిద్ధం అయింది. వివో టీ-సిరీస్‌లో లాంచ్ అయ్యే మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. వివో టీ1 5జీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు లాంచ్‌కు వారం ముందు వివో టీ1 5జీ స్మార్ట్ ఫోన్ ధర ఆన్‌లైన్‌లో లీకైంది.


వివో టీ1 5జీలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. చైనాలో లాంచ్ అయిన వివో టీ1 5జీ వేరియంట్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.17,999గా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మనదేశంలో ఇంత హైప్ వచ్చిన వివో ఫోన్ ఇదే.


వివో టీ1 ల్యాండింగ్ పేజీలను వివో ఇండియా వెబ్ సైట్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో చూడవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. దీంతోపాటు ఈ ఫోన్‌లో టర్బో కూలింగ్ ఫీచర్లు అందించనున్నారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.


వివో టీ1 5జీ స్పెసిఫికేషన్లు
వివో టీ1 5జీలో 6.67 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. పంచ్ హోల్ తరహా డిజైన్ ఇందులో ఉండనుంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించనున్నారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించనున్నారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. చైనా వేరియంట్‌లో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 1.0 ఆపరేటింగ్ సిస్టంను అందించారు. ఇండియన్ వేరియంట్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12పై పనిచేసే అవకాశం ఉంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఇందులో ఉండనున్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది.