హైదరాబాద్‌: గతంలో ఫోన్లు చోరీకి గురైతే అంతే సంగతి. వాటి గురించి మరిచిపోవాల్సి వచ్చేది. కానీ గత కొంతకాలం నుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. చోరీకి గురైన సెల్‌ఫోన్లను అధికారులు రికవరీ చేస్తున్నారు. చోరీ అయిన మొబైల్స్ రికవరీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సీఐడీ డైరెక్టర్‌ జనరల్‌ శిఖాగోయల్‌ వెల్లడించారు. ఈ నెల 19 వరకు 78,114 ఫోన్లను అధికారులు రికవరీ చేసినట్లు మంగళవారం (మే 20న) తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11,879 మొబైల్స్ తొలి స్థానంలో నిలవగా, 10,385 ఫోన్లతో సైబరాబాద్ కమిషనరేట్, 8,681 సెల్‌ఫోన్ల రికవరీతో రాచకొండ కమిషనరేట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.  

దేశంలో సెల్‌ఫోన్ల చోరీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం పోర్టర్ ఏర్పాటు చేసింది. ‘సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌)’ పేరుతో  కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసుశాఖకు, సైబర్ శాఖలకు లింక్ చేశారు. సెల్‌ఫోన్ చోరీకి గురైతే బాధితుడు ఆన్‌లైన్లోగానీ, పోలీస్‌స్టేషన్లో గానీ ఫిర్యాదు చేస్తే ఆ మొబైల్ ఐఎంఈఐ (IMEI) నంబర్‌ ద్వారా ట్రేస్ చేస్తున్నారు. అలా ట్రాక్ చేసిన సెల్ఫోన్లు లోకేష్ ఆధారంగా రికవరీ చేస్తున్నారు. అలా రికవరీ చేసిన సెల్‌ఫోన్లను ఓ కార్యక్రమం నిర్వహించి వాటి సంబంధిత యజమానులకు పోలీసులు అందిస్తున్నారు. ఎవరైనా సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు www.tspolice.gov.in వెబ్‌సైట్లో గానీ లేక www.ceir.gov.in వెబ్‌సైట్లో ఫిర్యాదు చేయవచ్చు అని శిఖాగోయల్ తెలిపారు.