శాంసంగ్ తన గెలాక్సీ ఏ52ఎస్ వినియోగదారులకు ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.0 అప్‌డేట్‌ను అందించింది. ఈ ఫోన్ మనదేశంలో గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయింది. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసేది.
శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ బిల్డ్ నంబర్ A528BXXU1BUL7గా ఉంది. ఈ అప్‌డేట్‌తో పాటు 2022 జనవరి సెక్యూరిటీ ప్యాచ్ కూడా రానుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టం సైజు 2.2 జీబీగా ఉండనుంది.
శామ్‌మొబైల్ కథనం ప్రకారం.. వన్ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్ కొన్ని యూరోప్ దేశాలతో పాటు మనదేశంలో కూడా వస్తుంది. జర్మనీ, స్పెయిన్, ఇటలీ, రొమేనియా, స్విట్జర్లాండ్, పోలండ్, లక్సెంబర్గ్, ఫ్రాన్స్‌ల్లో కూడా శాంసంగ్ ఈ అప్‌డేట్ అందించనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధరను ఇటీవలే తగ్గించారు. ఇందులో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999 నుంచి రూ.30,999కు తగ్గింది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999 నుంచి రూ.32,999కు తగ్గింది. అసమ్ మింట్, అసమ్ బ్లాక్, అసమ్ వైట్, అసమ్ వయొలెట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు
శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ-వో డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
4500 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 189 గ్రాములుగానూ ఉంది.