రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సోమవారం టీజ్ చేసింది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఎప్పటినుంచో వార్తల్లో ఉన్నాయి.


ఇందులో అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్ 11ఎస్‌తో పాటు నోట్ 11 సిరీస్ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. రెడ్‌మీ నోట్ 11 మోడల్స్ చైనాలో గతేడాది అక్టోబర్‌లోనే లాంచ్ అయ్యాయి. రెడ్‌మీ ఇండియా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌ను టీజ్ చేసింది.


ఈ ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉండే అవకాశం ఉంది. ఇందులో కేవలం 4జీ కనెక్టివిటీనే అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 5జీ కనెక్టివిటీ ఉండనుందో లేదో తెలియరాలేదు. సాధారణంగా రెడ్‌మీ నోట్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు రూ.20 వేలలోపు ధరతోనే లాంచ్ అవుతాయి. ఈ ఫోన్ ధర కూడా అదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.


ఈ నెల ప్రారంభం నుంచి రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ టీజ్ చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ రెండర్ల ప్రకారం.. ఈ ఫోన్‌లో హోల్ పంచ్ కెమెరా ఉండనుంది. సరిగ్గా డిస్‌ప్లే మధ్యలో ఈ కెమెరాను అందించనున్నారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉండనుంది.


వీటిలో ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం2 సెన్సార్ ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ ఓవీ2ఏ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో అందించనున్నారు.


రెడ్‌మీ నోట్ 11ఎస్‌లో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. బీఐఎస్, ఎన్‌బీటీసీ లిస్టింగ్‌ల్లో కూడా రెడ్‌మీ నోట్ 11ఎస్ కనిపించింది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్ గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను కంపెనీ జనవరి 26వ తేదీన నిర్వహించనుంది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 11 4జీ, రెడ్‌మీ నోట్ 11 5జీ, రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం ఉంది.