వన్‌ప్లస్ 10 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉందని లీకులు వస్తున్నాయి. ఈ వన్‌ప్లస్ అల్ట్రా స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఈ సంవత్సరం రెండో భాగంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ మధ్యే లాంచ్ అయిన వన్‌ప్లస్ 10 ప్రో కంటే టాప్ స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు త్వరలో రానున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్లలో హాజిల్‌బ్లాడ్ కెమెరాలను అందించనున్నట్లు సమాచారం.


షియోమీ అల్ట్రా సిరీస్‌కు పోటీగా వన్‌ప్లస్ దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని అనుకోవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ వెరిఫికేషన్ టెస్టులు జరుగుతున్నాయని సమాచారం. ఒక్కసారి ఈ టెస్టులు పూర్తయితే.. ఆ తర్వాత అధికారిక ప్రకటన, లాంచ్ అన్ని చకచకా అయిపోతాయి.


నిజానికి ఈ ఇంజనీరింగ్ వెరిఫికేషన్ టెస్టులు స్మార్ట్ ఫోన్ల ప్రోటోటైప్‌లపై చేస్తారు. డివైస్‌లకు మొదటి దశల్లో జరిగే టెస్టుల్లో ఇది కూడా ఒకటి. దీని తర్వాత డిజైన్ వెరిఫికేషన్ టెస్టింగ్ (డీవీటీ), ప్రొడక్ట్ వెరిఫికేషన్ టెస్టింగ్ (పీవీటీ) జరగనున్నాయి.


ఒప్పో, వన్‌ప్లస్ భాగస్వామ్యం గురించి కూడా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్5 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో కూడా హాజిల్ బ్లాడ్ కెమెరాలు అందిస్తారని తెలుస్తోంది. అలాగే ఒప్పో మారిసిలికాన్ ఎక్స్ ఎన్‌పీయూని వన్‌ప్లస్ ఫ్లాగ్ షిప్ డివైస్‌ల్లో అందించనున్నట్లు తెలుస్తోంది. 2022 ద్వితీయార్థంలో ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.


ఒప్పో మారిసిలికాన్ ఎక్స్ అనేది ఒక న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది ఫొటోలు, వీడియోలను మెరుగు పరుస్తుందని కంపెనీ అంటోంది. టీఎస్ఎంసీ 6 నానోమీటర్ టెక్నాలజీతో దీన్ని రూపొందించినట్లు కంపెనీ అంటోంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ ఫోన్లతోనే ఈ టెక్నాలజీ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.