ఓలా సంస్థ త్వరలో విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కలర్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఓలా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కానుందని ప్రకటన వెలువడిన నాటి నుంచి దానికి చెందిన ప్రతీ వార్తా సంచలనంగా మారుతోంది. స్కూటర్ టీజర్ మొదలు అడ్వాన్స్ బుకింగ్స్, ఒక్క రోజులోనే లక్ష బుకింగ్స్ ఇలా ప్రతీది హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇప్పటికే ఈ బైకులకు సంబంధించిన ఫొటోలు, పేర్లు, స్పెసిఫికేషన్లు ఇవే అంటూ పలువురు సోషల్ మీడియాలో ఫొటోలను షేరు చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. లీక్ అయిన ఫొటోల ద్వారా ఈ స్కూటర్ బ్లాక్, పింక్, లైట్ బ్లూ, వైట్ కలర్స్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఓలా సీఈవో ట్వీట్‌తో..
ఓలా కలర్స్ కు సంబంధించి సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ సైతం ట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల కలర్స్ ఈ రోజు ఖరారు చేయబడుతున్నాయని తెలిపారు. నాలుగు ఆప్షన్లను ఇచ్చి మీరైతే ఏ రంగు ప్రిఫర్ చేస్తారు అని యూజర్లను అడిగారు. ఇందులో పాస్టెల్ (Pastel), మెటాలిక్ (Metallic), మ్యాట్ (Matte) లతో పాటు గివ్ మీ ఆల్ (Give me all!!) అనే నాలుగు ఆప్షన్లను ఇచ్చారు.
పాస్టెల్ విభాగంలో రెడ్, ఎల్లో, బ్లూ.. మెటాలిక్ విభాగంలో సిల్వర్, గోల్డ్, పింక్.. మ్యాట్ విభాగంలో బ్లాక్, బ్లూ, గ్రే రంగులను ఇచ్చారు. ఈ నాలుగు ఆప్షన్లలో అత్యధికంగా గివ్ మీ ఆల్ ఆప్షన్ కు 43.4 శాతం ఓ రాగా, తర్వాతి స్థానాల్లో మ్యాట్ (41 శాతం) పాస్టెల్ (9.8 శాతం), మెటాలిక్ (5.8 శాతం) ఉన్నాయి.
రికార్డు స్థాయిలో బుకింగ్స్..
ఎలక్ట్రిక్ బైక్స్ కోసం ఎదురుచూసే వారి కోసం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని కోసం అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభించింది. త్వరలో విడుదల చేయబోయే ఈ స్కూటర్‌కు బుకింగ్ ఫీజుగా రూ.499 చెల్లించాలని తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో లక్ష మంది స్కూటర్ కోసం రిజర్వ్ చేసుకున్నారని సంస్థ వెల్లడించింది. ఇక ఈ స్కూటర్ల కోసం దేశవ్యాప్తంగా 400 పట్టణాల్లో హైపర్ చార్జర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రకటించింది.
వేరియంట్లు ఇవే!
ఈ స్కూటర్ వేరియంట్ల వివరాలు అధికారికంగా విడుదల చేయనప్పటికీ, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మొత్తం మూడు వేరియంట్లలో ఈ స్కూటర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. లీకుల ప్రకారం.. ఓలా సిరీస్ S, S1, S1 ప్రో అనే మూడు పేర్లతో వేరియంట్లు రాబోతున్నట్లు తెలిసింది. సిరీస్ ఎస్ అనేది అధికారిక పేరు కాగా, ఎస్ 1, ఎస్ 1 ప్రో వేరియంట్లుగా ఉండనున్నాయి. ఎస్ 1ను బేస్ వేరియంట్‌గా, ఎస్ 1 ప్రో టాప్ వేరియంట్‌గా ఉండనుంది.
ఈ బండిని ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అలాగే జీరో శాతంగా ఉన్న స్కూటర్ చార్జింగ్ కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం వరకు చేరుతుంది. ఓలా స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ ఓలా స్కూటర్ ధర రూ.లక్ష నుంచి రూ. 1.2 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.