భారత్ లో 5G సేవల విస్తరణపై ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. దేశంలో అత్యుత్తమ 5G సేవలు అందించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం 13 నగరాల్లో 5G సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. నెమ్మది నెమ్మదిగా ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అడుగులు వేస్తున్నది. నెట్ వర్క్ పరిధిని అందించడంతో పాటు 5G సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా అందిస్తున్న కంపెనీగా జియో తాజాగా గుర్తింపు పొందింది. పోటీ సంస్థలు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాతో పోల్చితే జియో సేవలు చాలా బాగున్నాయంటూ  తాజాగా ఓ సర్వేలో వెల్లడి అయ్యింది.


నోకియా నుంచి జియోకు 5G పరికరాలు


ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో కీలక ఒప్పందం చేసుకుంది. 5G సర్వీసులను అందించేందుకు అవసరమైన పరికరాలను అందించే ప్రొవైడర్ గా ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ నోకియాను సెలెక్ట్ చేసుకుంది. అంతేకాదు, సదరు కంపెనీతో అతిపెద్ద ఒప్పందం చేసుకున్నది. ఇందులో భాగంగా జియోకు 5జీ రేడియో యాక్సెస్ నెట్ వ‌ర్క్ ప‌రిక‌రాల‌ను నోకియా అందించనుంది. దేశవ్యాప్తంగా జియోకు  420 మిలియ‌న్ల‌కు పైగా వినియోగదారులు ఉన్న నేపథ్యంలో.. భారతదేశం అంతటా వైర్ లెస్ సేవ‌ల‌ను విస్త‌రించే ప్రయత్నం చేస్తున్నది. ఇందుకు అవసరం అయిన ఎక్యుప్ మెంట్ అంతా నోకియా ప్రొవైడ్ చేయనున్నది.  నోకియా త‌న ఎయిర్ స్కేల్ పోర్ట్ ఫోలియా నుంచి బేస్ స్టేష‌న్లు,  హై కెపాసిటీ తో కూడిన 5G మాసివ్ మిమో యాంటెన్నాలు ,  పలు  క్ట్ర‌మ్ బ్యాండ్లు,  సెల్ఫ్ ఆర్గ‌నైజింగ్ నెట్ వ‌ర్క్ సాఫ్ట్ వేర్ కు సపోర్టు చేసేందుకు  రేడియో హెడ్లు సహా పలు రకాల ఎక్యుప్ మెంట్స్ అందించనున్నది.





 ప్రపంచ స్థాయి  5G నెట్ వర్క్ కాబోతుంది- ఆకాష్ అంబానీ


నోకియాతో ఒప్పందం పట్ల రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. జియో తన వినియోగదారులందరికీ  5G  సేవలను మరింత మెరుగ్గా అందించడానికి ఈ నెట్ వర్క్ టెక్నాలజీలో నిరంతరం పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలిపారు. నోకియా భాగస్వామ్యంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అధునాతన 5G నెట్‌ వర్క్‌లలో ఒకదాని జియో నెట్ వర్క్ ను నిలిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.   


Also Read: డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో జియోను మించిపోయిన ఎయిర్ టెల్ - పోటీ మామూలుగా లేదు!


గర్విస్తున్నాం- పెక్కా లండ్మార్క్


 రిలయన్స్ తో డీల్ చాలా కీలకమైనదిగా నోకియా ప్రెసిడెంట్, CEO  పెక్కా లండ్‌మార్క్ అభిప్రాయపడ్డారు.  ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఒప్పందం మూలంగా భారతదేశం అంతటా మిలియన్ల మంది జియో వినియోగదారులకు  ప్రీమియం 5G సేవలు అందే అవకాశం ఉందన్నారు. ప్రముఖ ఎయిర్‌స్కేల్ పోర్ట్‌ఫోలియో ద్వారా ఈ పరికరాల సరఫరా ఉంటుందని చెప్పారు. రిలయన్స్ జియో తమ సాంకేతికతపై  నమ్మకాన్ని ఉంచినందుకు గర్విస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జియోతో సుదీర్ఘమైన భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నట్లు  లుండ్‌మార్క్ చెప్పారు.