కెమెరా బ్రాండ్ లెయికాతో షియోమీ కొన్ని నెలల క్రితమే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి భాగస్వామ్యంలో మొదటి ఫోన్ రానుంది. జులై 4వ తేదీన లాంచ్ కానున్న షియోమీ 12ఎస్‌ను వీరి భాగస్వామ్యంలో మొదటిగా లాంచ్ చేయనున్నారు. షియోమీ 12ఎస్ అల్ట్రా స్మార్ట్ ఫోన్ కూడా ఈ సిరీస్‌లో లాంచ్ కానుంది.
షియోమీ సీఈవో లెయ్ జున్ ఈ విషయాన్ని వీబో ద్వారా కన్‌ఫర్మ్ చేశారు. ఈ సిరీస్‌లో షియోమీ 12ఎస్, షియోమీ 12ఎస్ ప్రో, షియోమీ 12ఎస్ అల్ట్రా ఉండనున్నాయి. అసుస్ రోగ్ ఫోన్ 6 లాంచ్‌కు రెండు రోజుల ముందు షియోమీ ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. కాబట్టి క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1తో లాంచ్ కానున్న మొదటి ఫోన్లు ఇవే అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం... షియోమీ 12ఎస్ ప్రోలో రెండు వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో ఒక వేరియంట్‌లో డైమెన్సిటీ 9000 ప్రాసెసర్, మరో వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది. ప్రో వేరియంట్2లో 120W ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ, 512 జీబీ వరకు స్టోరేజ్ ఉండనుంది.
ఇక అల్ట్రా విషయానికి వస్తే... ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై షియోమీ 12ఎస్ అల్ట్రా పనిచేయనుంది. 8 జీబీ లేదా 12 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ లేదా 512 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
ఇక కెమెరా విషయానికి వస్తే... షియోమీ 12 అల్ట్రాలో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు ఓఐఎస్ సపోర్ట్ కూడా ఉండనుంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 48 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాను ఇందులో అందించనున్నారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!