రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుందని కూడా కంపెనీ సీఈవో ప్రకటించారు. అయితే రియల్‌మీ 9ఐ 5జీ లాంచ్ ఈవెంట్లో కూడా ఈ ఫోన్‌ను కంపెనీ టీజ్ చేసింది. అయితే దీని లాంచ్ తేదీని మాత్రం ప్రకటించలేదు.


ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నారు. రియల్‌మీ 9ఐ 5జీ లాంచ్ ఈవెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్‌ను కంపెనీ ప్రకటించింది.


జూన్‌లో రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. దీని ధరను 469.99 డాలర్లుగా (సుమారు రూ.36,600) నిర్ణయించారు. ఇది బేస్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. ఎక్కువ ధర ఉన్న వేరియంట్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి.


రియల్‌మీ జీటీ నియో 3టీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్‌గా ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై రియల్‌మీ జీటీ నియో 3టీ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. దీని వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్యార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 80 పర్సెంట్ చార్జింగ్ అవ్వడానికి కేవలం 12 నిమిషాలు మాత్రమే పట్టనుందని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ జీటీ నియో 3టీ పనిచేయనుంది.


రియల్‌మీ జీటీ నియో 3లో నరుటో ఎడిషన్, థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్‌లను కంపెనీ జులై నెలలో లాంచ్ చేసింది. ఎంతో ఫేమస్ అయిన నరుటో గేమ్ థీమ్‌తో నరుటో ఎడిషన్‌ను, థోర్ లవ్ అండ్ థండర్ సినిమా విడుదల సందర్భంగా మార్వెల్ స్టూడియోస్ భాగస్వామ్యంతో  థోర్: లవ్ అండ్ థండర్ ఎడిషన్‌ను కంపెనీ రియల్‌మీ మనదేశంలోకి తీసుకువచ్చింది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!