మోడ్రన్ డేస్‌లో ఒకవైపు కమ్యూనికేషన్ మాధ్యమాల నుంచి బ్యాంకింగ్ వ్యవస్థల వరకు ప్రతి ఒక్కరి చేతిలో టెక్నాలజీ వాడకంతో ఇంటర్నెట్ ఉంటుంది. టెక్నాలజీ వినియోగం ఎంత వేగంగా పెరుగుతుందో సైబర్ నేరాలు సైతం అంతే వేగంగా పెరుగుతున్నాయి. టెక్నాలజీని వాడి ఆన్‌లైన్ మోసాలు, బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు కాజేస్తున్నారు. ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్‌లైన ఫేక్ యాప్స్, డేంజరస్ యాప్స్ వల్ల సైబర్ నేరగాళ్లు మీ మొబైల్ ఫోన్లను కంట్రోల్ లోకి తెచ్చుకుంటున్నారు. ఆ తరువాత వారి సమ్మతి, అనుమతి లేకుండా ఆర్ధిక లావాదేవీలు జరిపి బ్యాంక్ ఖాతాలో ఖాళీ చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ (MHA) పరిధిలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం కొత్త అడ్వైజరీని జారీ చేసింది.
I4Cకి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ త్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) ప్రకారం, ఆండ్రాయిడ్ యాప్‌లతో ముడిపడి ఉన్న ఆర్థిక మోసాల కేసులు పెరిగినట్లు తెలిపింది. ఈ యాప్‌ల ప్రచారం ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించే యాడ్స్ ద్వారా జరుగుతోంది. సంబంధిత విభాగం గత వారం బుధవారం (ఆగస్టు 26) జారీ చేసిన అడ్వైజరీలో ‘Night Play, Kyss, Reloop, Vimo, Rivo, Nexo, Vixa’ వంటి పేర్లతో నడుస్తున్న appsను గుర్తించింది. ఇవే కాకుండా ఈ తరహాకు చెందిన మరికొన్ని వేరియంట్లు కూడా యాక్టివ్‌గా ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది.
MHA అడ్వైజరీలో ఏం చెప్పింది?
ఆ అడ్వైజరీ ప్రకారం, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కిందకు వచ్చే ఈ విభాగం.. వినియోగదారులను మొదట అశ్లీల కంటెంట్ ఇచ్చే వెబ్‌సైట్‌లకు తీసుకెళ్లే ప్రకటనల ద్వారా ఆకర్షించడానికి ప్రయత్నిస్తారని తెలిపింది. ఆ తర్వాత ఈ వెబ్‌సైట్‌లలో గూగుల్ ప్లే స్టోర్ (Google Play store) బయటి సోర్స్ నుంచి ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ అంటే APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని వినియోగదారులను ప్రేరేపిస్తుంటారు.
మొబైల్ ఫోన్‌లో యాప్ పూర్తిగా ఇన్‌స్టాల్ అయిన తర్వాత, అది వినియోగదారుని నుంచి ఫోన్ యాక్సెసిబిలిటీ యాక్సెస్‌తో సహా అనేక అనుమతులను కోరుతుంది. వినియోగదారులు గనుక పొరపాటున ఈ యాప్ వాడేందుకుగానూ ఈ అనుమతులన్నీ ఇచ్చేస్తే, ఆ మాల్వేర్ ఫోన్‌పై నియంత్రణను తెచ్చుకుంటుంది. దాంతో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ యాప్ నిరంతరం యాక్టివ్‌గా ఉంటుంది.
సైబర్ నేరగాళ్లు యాక్సెసిబిలిటీ ఫీచర్‌ను ఉపయోగించి ఫోన్ స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని చదవడంతో పాటు కొన్నిసార్లు బటన్‌లను క్లిక్ చేయగలరు. ముఖ్యంగా వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) లేదా పిన్ నంబర్లను నమోదు చేయగలరు. దాంతో ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసి మీ డబ్బును కూడా బదిలీ చేస్తారు. దీనివల్ల సంబంధిత వ్యక్తి బ్యాంక్ ఖాతాకు అనధికారిక ప్రవేశం పొంది మీ క్యాష్ ఆన్‌లైన్ ద్వారానే దొంగిలించే అవకాశం ఉంది. ఇంటర్నెట్ ద్వారా పంపే సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం సైతం పెరుగుతుంది.
మంత్రిత్వ శాఖ (MHA) సూచించిన ఉపాయాలు ఇవే
NCTAU ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి కొన్ని సలహాలు ఇచ్చింది. యాప్‌లను కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఇతర నమ్మకమైన యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రకటనలు, అనుమానాస్పద వెబ్‌సైట్‌లు లేదా తెలియని లింక్‌ల ద్వారా ప్రచారం చేసే ఏ రకమైన APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడం చేయవద్దు. ఏదైనా అనుమానాస్పద యాప్‌కి కూడా ఫోన్ యాక్సెసిబిలిటీ పర్మిషన్ ఇవ్వకూడదు. ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను క్రమం తప్పకుండా చెక్ చేసుకుని, మీ ప్రమేయం లేకుండా లేదా తెలియకుండా ఇన్‌స్టాయి అయిన యాప్‌లను వెంటనే రిమూవ్ చేయాలి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను ఎనేబుల్ చేసి ఉంచాలి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి.
మీ బ్యాంక్ ఖాతాలు, UPI లావాదేవీలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఏదైనా నకిలీ యాప్ లేదా సైబర్ నేరాలకు గురైతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయాలి. లేదా ప్రభుత్వ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
