Best OTT Plan in India: భారత అపర కుబేరుడు ముకేష్ అంబానీ ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగం రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి. ప్రత్యర్థి కంపెనీలు కుదేలవుతాయి. టెలికాం రంగంలో ఏం జరిగిందో మనం ఇప్పటికే చూశాం. జియో దెబ్బకి మార్కెట్లో టెలికాం కంపెనీలు రెండే మిగిలాయి. వీటిలో ఒకటి ఎయిర్‌టెల్ కాగా, మరొకటి వొడాఫోన్, ఐడియా భాగస్వామ్యంతో ఏర్పడిన వీఐ. ఇప్పుడు ముకేష్ అంబానీ ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టారు.


జియో సినిమాతో ఓటీటీ స్పేస్‌లో ఎంట్రీ ఇచ్చారు. రూ.999తో వార్షిక ప్రీమియం ప్లాన్‌ను కూడా జియో ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ లాంటి పెద్ద ఓటీటీ ప్లేయర్లను సవాల్ చేయడానికి జియో సినిమా సిద్ధం అయింది.


ఐపీఎల్‌తో అట్టహాసంగా
ఐపీఎల్ 2023 కారణంగా ముకేష్ అంబానీ కంపెనీ ఇప్పటికే కోట్లాది మంది కస్టమర్లను సంపాదించుకుంది. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను కొనుగోలు చేసిన తర్వాత, జియో సినిమా దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూసే ప్రయోజనాన్ని అందించింది. దీంతో కోట్లాది మంది వీక్షకులను తన ప్లాట్‌ఫారమ్‌లోకి చేర్చుకోవడంలో కంపెనీ విజయం సాధించింది. ఇప్పుడు కంపెనీ ఈ యూజర్ బేస్‌ను తన ప్రీమియం ప్లాన్‌ల కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకునే కస్టమర్‌లుగా మార్చడానికి ప్రయత్నిస్తోంది.


ఎవరి ప్లాన్ చవకగా ఉంది?
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొదలైన వాటితో జియో సినిమా ఏ మేరకు పోటీ పడగలదో చూద్దాం. అన్నిటి కంటే ముఖ్యమైనది ప్లాన్ మొత్తం. జియో సినిమా వార్షిక ప్రీమియం ప్లాన్ రూ. 999 కాగా, అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్ రూ. 1,499గా ఉంది. డిస్నీ హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్ కూడా రూ. 1,499గానే నిర్ణయించారు. యాడ్స్‌తో వచ్చే సూపర్ ప్లాన్ ధర రూ. 899గా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లేదు. నెలకు రూ.149 నుంచి రూ.649 మధ్య నెట్‌ఫ్లిక్స్ ప్లాన్లు ఉన్నాయి.


వెనకబడ్డ నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ భారతీయ మార్కెట్లో అందిస్తున్న ప్లాన్‌లను పరిశీలిస్తే, దాని చవకైన ప్లాన్ నెలకు రూ. 149గా ఉంది. ఇది కేవలం మొబైల్ సపోర్టెడ్ ప్లాన్ మాత్రమే. ఒక్క డివైస్‌లో కంటెంట్ స్ట్రీమ్ చేయడానికే ఇది ఉపయోగపడుతుంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది రూ. 1,788గా ఉంది. అంటే ప్రీమియం ప్లాన్‌లతో పోలిస్తే జియో సినిమా మాత్రమే కాకుండా అన్ని ఇతర పోటీదారుల కంటే కూడా అత్యంత ఖరీదైనది. దీని ఇతర ప్లాన్‌లలో రూ. 199 బేసిక్ మంత్లీ ప్లాన్, రూ. 499 స్టాండర్డ్ మంత్లీ ప్లాన్, రూ. 649 ప్రీమియం మంత్లీ ప్లాన్ ఉన్నాయి. మరో వైపు అమెజాన్ ప్రైమ్ నెలవారీ ప్లాన్ రూ. 299గా ఉంది.


ఫీచర్లు ఎందులో బాగున్నాయి?
జియో సినిమా ప్రీమియం ప్లాన్‌తో కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. మీరు ఈ ప్లాన్‌ని తీసుకోవడం ద్వారా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, టీవీ వంటి ఏ పరికరంలో అయినా కంటెంట్‌ను చూడవచ్చు. ఇది గరిష్టంగా నాలుగు పరికరాలలో ఏకకాలంలో వీక్షించడానికి అనుమతిస్తుంది. 4కే రిజల్యూషన్‌ను అందిస్తుంది. Netflixలో ఈ ఫీచర్ల కోసం, మీరు నెలవారీ ప్రీమియం ప్లాన్ రూ. 649 తీసుకోవాలి. అమెజాన్ ప్రైమ్ తన వార్షిక ప్లాన్‌లో ఈ ఫీచర్లను అందిస్తుంది. అయితే డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా ప్రీమియం ప్లాన్‌తో ఈ ఫీచర్లను అందిస్తుంది. ఫీచర్ల పరంగా కూడా, జియో సినిమా మిగిలిన వాటి కంటే ముందంజలోనే ఉంది.


కంటెంట్‌లో కింగ్ ఎవరు?
ఇప్పుడు చివరి, అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే కంటెంట్. ప్రీమియం, ప్రత్యేకమైన కంటెంట్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులు దీన్ని ఇష్టపడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో మనీ హీస్ట్, స్ట్రేంజర్ థింగ్స్ వంటి అనేక గ్లోబల్ కంటెంట్‌ ఉంది. వీటిని ప్రజలు బాగా ఇష్టపడతారు. ఇది నెట్‌ఫ్లిక్స్ బలం కూడా. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఉన్నంతలో లాయల్ యూజర్ బేస్ ఉంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ హెచ్‌బీవోని ఇప్పటికే కోల్పోయింది. ఇప్పుడు మార్వెల్ సినిమాలు, సిరీస్‌లు మాత్రమే డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌లో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ ప్రత్యేకత ఏమిటంటే ది ఫ్యామిలీ మ్యాన్, మేడ్ ఇన్ హెవెన్, మిర్జాపూర్, పంచాయత్ వంటి సిరీస్‌లను భారతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. అవి సూపర్ హిట్ అయ్యాయి


ఇప్పుడు జియో సినిమా సర్వీసుకు ఐపీఎల్ తర్వాత హెచ్‌బీవో సపోర్ట్ లభించింది. అంటే ఇప్పుడు HBOకి సంబంధించిన గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది లాస్ట్ ఆఫ్ అస్, హౌస్ ఆఫ్ డ్రాగన్ వంటి బ్లాక్ బస్టర్ కంటెంట్ జియో సినిమాలో అందుబాటులో ఉంటుంది. హ్యారీ పాటర్, ది డార్క్ నైట్, బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్, జస్టిస్ లీగ్ వంటి కంటెంట్‌ను అందించిన వార్నర్ బ్రదర్స్ స్టూడియోతో కూడా జియో సినిమా కూడా జతకట్టింది.


ఈ విధంగా కంటెంట్ పరంగా జియో సినిమా మంచి ప్రిపరేషన్‌తో ఓటీటీ రంగంలో ఎంట్రీ ఇచ్చింది. జియో సినిమా దాని దేశీయ బ్యానర్ ప్రయోజనాన్ని కూడా పొందుతుంది. అనేక బాలీవుడ్ సినిమాలు జియో సినిమాలో ఎక్స్‌క్లూజివ్‌గా ఉంటాయి. మొత్తమ్మీద, జియో సినిమా ధర, ఫీచర్లతో పాటు కంటెంట్ పరంగా కూడా బలంగా ఉందని చెప్పవచ్చు. ఈ నాలుగింటిలో అమెజాన్ ప్రైమ్‌కు మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. దాని కస్టమర్‌లు ఒకేసారి అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుంచి గొప్ప ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌కి ఉన్న ఈ ప్రత్యేకత ఎవరికీ లేదు.