మనం రోజువారీగా ఉపయోగించే వెబ్ కేవలం కొంత భాగం మాత్రమే అని మీకు తెలుసా? ఇది సముద్రంలో తేలియాడే మంచుకొండ (Iceberg) లాంటిది. పైన శిఖరం మాత్రమే కనిపిస్తుంది. దాని లోతు దగ్గరకు వెళితే కానీ తెలియదు. అలాగే, మనం వాడుతున్న ప్రపంచవ్యాప్త వెబ్‌ను (World Wide Web) మూడు భాగాలుగా విభజించారు:

Continues below advertisement

సర్ఫేస్ వెబ్ (Surface Web)

డీప్ వెబ్ (Deep Web)

Continues below advertisement

డార్క్ వెబ్ (Dark Web)

అయితే, వీటికి ఉన్న ప్రాధాన్యతలు, తేడాలు ఏంటో ఈ కథనం పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది. ఇంటర్నెట్ ఉపరితలం దాటి చీకటి లోతుల్లోకి వెళ్దామా...?

1. సర్ఫేస్ వెబ్ (Surface Web)

ప్రతిరోజు మనం వాడుతున్న వెబ్‌నే సర్ఫేస్ వెబ్ అంటారు. అంటే, గూగుల్, బింగ్ (Google, Bing) వంటి సెర్చ్ ఇంజన్లకు అందుబాటులో ఉండే, సులభంగా గుర్తించగలిగే సాధారణ బ్రౌజర్‌లలో (Google Chrome, Firefox వంటివి) లభ్యమయ్యే భాగం ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే, మనం చేరుకోగలిగే సులువైన ఇంటర్నెట్ భాగం. ఈ సర్ఫేస్ వెబ్ అనేది ఇంటర్నెట్‌లో కేవలం నాలుగు నుండి ఐదు శాతం మాత్రమే ఉంటుంది. ఇందులో పబ్లిక్ సైట్‌లు, వార్తా మాధ్యమాలు (News & Media), వికీపీడియా, పబ్లిక్ బ్లాగులు, సోషల్ మీడియా పేజీలు ఉంటాయి. సాధారణ ఇంటర్నెట్ యూజర్లు, వినియోగదారులు, మీడియా సంస్థలు, ఈ-కామర్స్ సంస్థలు ఈ సర్ఫేస్ వెబ్‌నే వినియోగించుకుంటాయి. ఇది మనం ప్రస్తుతం వాడుతున్న ఇంటర్నెట్‌లోని ఉపరితల భాగం.

2. డీప్ వెబ్ (Deep Web)

ఇక డీప్ వెబ్ అనేది ఇంటర్నెట్‌లోని ఓ అదృశ్యమైన పొరగా చెప్పవచ్చు. ఈ డీప్ వెబ్ సెర్చ్ ఇంజన్లకు అందుబాటులో ఉండదు. చట్టబద్ధమైన, గోప్యతా కారణాల వల్ల దీన్ని దాచి ఉంచుతారు. ఇది ఇంటర్నెట్‌లో దాదాపు 90 శాతం ఉంటుంది.ఈ డీప్ వెబ్‌లో దాచిన కంటెంట్‌ను యాక్సెస్ చేయాలంటే, లాగిన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే, యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు వంటి ప్రత్యేక విధానం అవసరం. ఈ డీప్ వెబ్‌ను నీటిలో మునిగి ఉన్న మంచుకొండ ప్రధాన భాగంగా చెబుతారు.ఉదాహరణకు: ఇందులో వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఈ-మెయిల్స్, పాస్‌వర్డ్‌తో రక్షించే సోషల్ మీడియా అకౌంట్‌లు/ప్రొఫైల్‌లు, క్లౌడ్ స్టోరేజ్ (Google Drive, Dropbox వంటివి) ఉంటాయి. పాస్‌వర్డ్ ఉపయోగించి తమ సమాచారాన్ని రక్షించుకోవాలనుకునేవారు ఈ డీప్ వెబ్‌ను వినియోగిస్తారు.

3. డార్క్ వెబ్ (Dark Web)

ఈ డార్క్ వెబ్ అనేది ఓ చీకటి లోకం. ఇది డీప్ వెబ్‌లో ఒక చిన్న భాగం మాత్రమే. దీన్ని యాక్సెస్ చేయడం అంత సులువు కాదు. ఇందుకోసం Tor (The Onion Router) వంటి ప్రత్యేకమైన ఎన్‌క్రిప్టెడ్ బ్రౌజర్‌లు వినియోగించాల్సి ఉంటుంది. ఇది వాడేవారి యూజర్ ఐడెంటిటీని, వారి లొకేషన్‌ను అజ్ఞాతంలో ఉంచుతుంది.దీన్ని ఉపయోగించి మంచి చేసేవారు, చెడు చేసేవారు కూడా ఉన్నారు.

మంచి పనులకు వాడటం: దీని ద్వారా జర్నలిస్టులు ఆయా సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వాల అవినీతిని బయటకు తేవడానికి ఉపయోగిస్తారు. నిరంకుశ దేశాల్లో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు పంచుకోవడానికి రాజకీయ అసమ్మతి వాదులు, స్వేచ్ఛావాదులు వాడుతుంటారు. గోప్యత కోరుకునేవారు కూడా ఈ డార్క్ వెబ్‌ను వాడతారు.

చెడు పనుల విషయానికి వస్తే: కొద్దిమంది హ్యాకర్లు డేటాను దొంగలించడానికి, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డు సమాచారాన్ని తస్కరించడానికి వాడతారు. డ్రగ్స్, ఆయుధాల అమ్మకం, నకిలీ పత్రాల తయారీ వంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు కూడా వాడుతుంటారు.

డార్క్ వెబ్‌సైట్‌ల డొమైన్‌లు సాధారణంగా .onion తో ముగుస్తాయి. దీనిని యాక్సెస్ చేయడానికి టార్ (Tor) లేదా ఐ2పి (I2P) వంటి ప్రత్యేక నెట్‌వర్క్ సాఫ్ట్‌వేర్ అవసరం.

డార్క్ వెబ్‌లో పొంచి ఉన్న ప్రమాదాలు

డార్క్ వెబ్ వాడటం అనేది ప్రమాదకరం. దీన్ని వాడటం చట్టవిరుద్ధం కాకపోయినా, ఇందులో జరిగే కార్యకలాపాలన్నీ ఎక్కువగా చట్టవిరుద్ధంగానే జరుగుతుంటాయి. దీన్ని యాక్సెస్ చేయడం ద్వారా సైబర్ దాడులు, మోసాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ డార్క్ వెబ్ జోలికి వెళ్లకపోవడం మంచిది.