Infinix Smart 8 India Launch: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 స్మార్ట్ ఫోన్ త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన టీజర్ వీడియో కూడా విడుదల అయింది. జనవరి 13వ తేదీన ఈ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. 2023 ఫిబ్రవరిలో లాంచ్ అయిన ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 7కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ ఇప్పటికే నైజీరియన్ మార్కెట్లో లాంచ్ అయింది. నైజీరియన్ వెర్షన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. అక్కడ లాంచ్ అయిన మోడల్లో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కానీ భారతీయ మార్కెట్లో మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారని టీజర్ వీడియోలో తెలిపారు.


ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ధర (అంచనా)
ఈ ఫోన్ నైజీరియాలో 97,900 నైరాల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.10,100) ధరతో ఎంట్రీ అయింది. క్రిస్టల్ గ్రీన్, గెలాక్సీ వైట్, టింబర్ బ్లాక్, షైనీ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8ను కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో మాత్రం రూ.ఏడు వేల ప్రైస్ బ్రాకెట్‌లోనే ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.


ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 నైజీరియా వెర్షన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Infinix Smart 8 Specifications)
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8లో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే పీక్ బ్రైట్‌నెస్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కానుంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్ అందించారు. దీన్ని ఏకంగా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. 256 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మరింత ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ అసిస్టెడ్ కెమెరా అందించారు. ఇండియన్ వెర్షన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W వైర్డ్ ఛార్జింగ్‌ను ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ సిమ్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ కూడా అందించారు. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందుబాటులో ఉంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ ద్వారా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు.


మరోవైపు ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో గతంలో లాంచ్ అయింది. ఇది ఒక గేమింగ్ సెగ్మెంట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు ట్రాన్స్‌పరెంట్ ఎఫెక్ట్ అందించే బ్యాక్ ప్యానెల్ చూడవచ్చు. మినీ ఎల్ఈడీ లైట్ స్ట్రిప్, రిఫ్లెక్టివ్ హార్డ్ వేర్‌ను కూడా ఈ ఫోన్‌లో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. వేపర్ కూలింగ్ ఛాంబర్, బైపాస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న అమోఎల్ఈడీ స్క్రీన్‌ ఈ ఫోన్‌లో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉండటం విశేషం.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!