ప్రస్తుతం ప్రపంచంలో నంబర్ వన్ మెసేజింగ్ యాప్ మెటా ఆధీనంలో ఉన్న వాట్సాప్. ఇందులో ఎన్నో కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు. ఫీచర్లు అందుబాటులో లేకపోయినా కొన్ని ట్రిక్స్ ద్వారా వాట్సాప్‌లో లేని ఫీచర్లను కూడా యాక్సెస్ చేయవచ్చు.


వాట్సాప్‌లో మనం ఎవరికైనా మెసేజ్ చేయాలంటే వారి నంబర్ సేవ్ చేయడం తప్పనిసరి. ఒక్కసారి చిన్న అవసరానికి టెక్స్ట్ చేయాలన్నా వారి నంబర్ సేవ్ చేయాల్సి రావడం తలనొప్పి వ్యవహారమే. కానీ ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే మీరు నంబర్ సేవ్ చేయని యూజర్లకు కూడా మెసేజ్ చేయవచ్చు.


దానికి ఏం చేయాలి?
ముందుగా వాట్సాప్‌లో మీరు ఎవరో ఒకరి కాంటాక్ట్ ఓపెన్ చేసి (సెల్ఫ్ మెసేజ్ అయినా చేసుకోవచ్చు) మీరు ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటున్నారో వారి నంబర్ పంపండి. ఆ నంబర్‌పై క్లిక్ చేయగానే మీకు ‘Chat With **********’, ‘Call on Whatsapp’, ‘Add To Contacts’ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.


మీరు వారితో ఛాట్ చేయాలనుకుంటే ‘Chat With **********’ ఆప్షన్ ఎంచుకుని వారితో ఛాట్ చేయవచ్చు. ఒకవేళ వారికి వాట్సాప్ కాల్ చేయాలనుకుంటే ‘Call on Whatsapp’ ఆప్షన్ ఉపయోగించవచ్చు. అలాగే కాంటాక్ట్స్‌కి కూడా యాడ్ చేసుకోవచ్చు.


వాట్సాప్ దీన్ని డైరెక్ట్ ఫీచర్‌గా అందించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo ఈ విషయాన్ని తెలిపింది. ఈ ఫీచర్ కింద కాంటాక్ట్స్ లిస్ట్‌లోకి వెళ్లి అక్కడ మనం మెసేజ్ చేయాలనుకున్న వారి నంబర్ డయల్ చేస్తే కింద మెసేజ్ చేసే ఆప్షన్ కనిపిస్తుందంట.


యాప్‌లో వినియోగదారుల ప్రైవసీని మెరుగుపరచడానికి వాట్సాప్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా టెస్టర్ల కోసం కంపెనీ ఇటీవలే 'ఫోన్ నంబర్ ప్రైవసీ' ఫీచర్‌ను విడుదల చేసింది. దీని సహాయంతో వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను కమ్యూనిటీ గ్రూపుల్లో హైడ్ చేయవచ్చు. మీ నంబర్ కేవలం గ్రూప్ అడ్మిన్‌లకు, నంబర్‌ను సేవ్ చేసిన వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది. ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ Wabetainfo తన వెబ్ సైట్లో షేర్ చేసింది.


కమ్యూనిటీ గ్రూప్‌లోని ప్రొఫైల్ విభాగంలో బీటా టెస్టర్‌లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్‌ను ఇతరులకు కనిపించకుండా హైడ్ చేయవచ్చు. మీరు కమ్యూనిటీలో మెసేజ్ చేసినా సరే మీ నంబర్‌ను ఎవరూ చూడలేరు. చాలా మంది యూజర్లు కమ్యూనిటీ గ్రూపులో ఎమోజీతో రియాక్ట్ అయ్యే ఫీచర్‌ను కూడా ఇటీవలే పొందడం ప్రారంభించారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ కేవలం కమ్యూనిటీ గ్రూపులోని మెంబర్లకు మాత్రమే వర్తించనుంది. గ్రూప్ అడ్మిన్ నంబర్ మాత్రం ఎల్లప్పుడూ కనిపిస్తుంది.


Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial