మనం చూస్తున్న ప్రపంచం ఒకటి అయితే, మన కంటికి కనపడని మరో ప్రపంచం సైబర్ ప్రపంచం. ఇందులో నిత్యం సైబర్ దాడులు జరుగుతున్నాయి; డేటా చోరీలు పెరుగుతున్నాయి. డిజిటల్ మోసాలు నిత్యం ప్రజలను వెంటాడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సైబర్ దాడులు మరింత పెరిగి, మానవ జీవితాలు అల్లకల్లోలం అయ్యే పరిస్థితులు తలెత్తవచ్చు అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అయితే, వీటన్నింటి వెనుక ఉండేది హ్యాకర్లు అన్న విషయం మీకు తెలుసా? అయితే, ఈ హ్యాకర్లంతా చెడ్డవారేనా అంటే, కాదు సుమా! అసలు ఈ హ్యాకర్లలో ఎన్ని రకాల వారు ఉన్నారు? వారిని గుర్తించడానికి ప్రత్యేక రంగుల టోపీలు ఉన్నాయి. వాటి కథాకమామీషు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. హ్యాకర్లను మూడు ప్రధాన వర్గాలుగా విభజిస్తారు. వారి నైతికత, చట్టబద్ధత ఆధారంగా ఈ వర్గీకరణ జరిగింది. దీని ప్రకారం, వైట్ హ్యాట్ (White Hat) హ్యాకర్లు, బ్లాక్ హ్యాట్ (Black Hat) హ్యాకర్లు, గ్రే హ్యాట్ (Gray Hat) హ్యాకర్లు ఉన్నారు.
1. వైట్ హ్యాట్ హ్యాకర్లు
వైట్ హ్యాట్ హ్యాకర్లను సైబర్ ప్రపంచంలో హీరోలుగా గుర్తిస్తారు. వీరినే నైతిక హ్యాకర్లు (Ethical Hackers) అని కూడా పిలుస్తారు. సైబర్ భద్రతను కాపాడే నిపుణులు వీరు. వీరి ఉద్దేశం అంతా ప్రజా ప్రయోజనాలు కాపాడటమే. ఆయా సంస్థల సైబర్ భద్రతను వీరు కాపాడతారు. వీరు పనిచేసే సంస్థ తరపున సైబర్ బలహీనతలు ఏమైనా ఉన్నాయా అని కనుగొని, అవి ఇతర హ్యాకర్ల ద్వారా దుర్వినియోగం కాకముందే సరిదిద్దుతారు. సైబర్ కంపెనీలు అన్నీ తమ సమాచారం తస్కరణకు గురికాకుండా సైబర్ నిపుణులను (అంటే ఈ వైట్ హ్యాట్ హ్యాకర్లను లేదా ఎథికల్ హ్యాకర్లను) నియమించుకుంటాయి. అయితే, వీరు కూడా బ్లాక్ హ్యాట్ హ్యాకర్ల మాదిరే (అంటే వారి పద్ధతుల్లోనే) పనిచేసినా, నీతి, నియమాలను పాటించి భద్రతకే ప్రాధాన్యత ఇవ్వడం వీరి ముఖ్య ఉద్దేశం. చాలా పెద్ద పెద్ద కంపెనీలు (అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు) తమ సిస్టమ్స్‌లో ఏదైనా లోపాలు కనుగొంటే, అలాంటి వైట్ హ్యాట్ హ్యాకర్లకు భారీగా బహుమతులు కూడా ఇస్తాయి. దీన్నే బగ్ హంటింగ్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే, డిజిటల్ వరల్డ్‌లో వీరు ఓ పోలీస్‌లా పనిచేస్తారు.
2. బ్లాక్ హ్యాట్ హ్యాకర్లు
వీరు సైబర్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనవారు. వీరికి ఎలాంటి నైతిక నియమాలు ఉండవు. వీరినే సైబర్ నేరగాళ్లు అంటారు. ఆర్థిక లాభం, వ్యక్తిగత పగ తీర్చుకోవడం, ఆయా కంపెనీలు లేదా సంస్థలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని తస్కరించి వారిని బ్లాక్‌మెయిల్ చేయడం వంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. అంతేకాకుండా, వీరు ర్యాన్సమ్‌వేర్ (Ransomware) దాడులు నిర్వహించి ఆయా ప్రతిష్టాత్మక సంస్థలు లేదా ప్రభుత్వాల సమాచారాన్ని ధ్వంసం చేస్తుంటారు. వీరి వల్ల ఆయా సంస్థలు, ప్రభుత్వాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటారు. ఇలాంటి అనైతిక హ్యాకర్లను బ్లాక్ హ్యాట్ హ్యాకర్లు అంటారు.
3. గ్రే హ్యాట్ హ్యాకర్లు
వీరు వైట్, బ్లాక్ హ్యాకర్లకు మధ్యస్థంగా ఉండి పనిచేసే హ్యాకర్లు. వీరినే గ్రే హ్యాట్ హ్యాకర్లు అంటారు. వీరు నైతిక సరిహద్దుల్లోనే పనిచేస్తారు. అంటే, వీరు ఆయా కంపెనీలు లేదా సంస్థల సిస్టమ్స్‌లోకి చొరబడతారు. ఇందుకు ఎలాంటి అనుమతి తీసుకోరు. అయితే, వీరికి హాని చేసే ఉద్దేశాలు ఉండవు. కానీ, ఆ సంస్థ సైబర్ వ్యవస్థల్లో లోపాలను కనుగొని వారికి తెలియజేస్తారు. అయితే, కొద్దిమంది అనైతిక గ్రే హ్యాకర్లు కూడా ఇందులో ఉంటారు. వారు ఆ సమాచారానికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు, లేదంటే ఆ సమాచారం బయటపెడతామని బెదిరిస్తుంటారు. అయితే, చాలా మంది గ్రే హ్యాట్ హ్యాకర్లు, బ్లాక్ హ్యాట్ హ్యాకర్ల మాదిరి అత్యంత ప్రమాదకారులు మాత్రం కాదు.
4. హ్యాక్టివిస్టులు (Hacktivists)
వీరు కూడా హ్యాకర్లే, కానీ వీరికి ఎలాంటి హ్యాట్‌లు కేటాయించలేదు. అయితే, వీరు సామాజిక నిరసనలు తెలియజేయడానికి హ్యాకింగ్‌ను ఓ సాధనంగా వినియోగిస్తారు. ప్రభుత్వాలకు, కార్పొరేట్ సంస్థలకు ప్రజల లేదా తమ సమూహాల నిరసన తెలియజేయడానికి వారి సైబర్ వ్యవస్థలోకి చొరబడి తమ నిరసనను తెలియజేస్తారు. వారు చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ సైబర్ అటాక్స్‌ను వాడుతుంటారు. వీరినే హ్యాక్టివిస్టులుగా పిలుస్తారు.
5. స్క్రిప్ట్ కిడ్డీస్ (Script Kiddies)
వీరు మరో రకం. అయితే, వీరు స్వయానా హ్యాకర్లు కాదు. ఎలాంటి సైబర్ పరిజ్ఞానం కలవారు కాదు. ఇతరులు తయారుచేసిన హ్యాకింగ్ టూల్స్ వాడి సరదాగా వ్యక్తుల మీద, లేదా చిన్న సంస్థల మీద సైబర్ దాడులు చేస్తుంటారు. వీరిని స్క్రిప్ట్ కిడ్డీస్‌గా పిలుస్తారు.
ఈ రంగుల టోపీలు ఎలా వచ్చాయంటే...?
ఈ హ్యాకర్లకు ఎవరూ టోపీలు పెట్టలేదు. సహజంగా సైబర్ ప్రపంచంలో వీరు చేసే నైతిక, అనైతిక కార్యక్రమాలకు అనుగుణంగా ఈ రంగుల టోపీలు ఇస్తారు. అయితే, ఇందుకు ప్రధాన కారణం వెస్ట్రన్ సినిమాలుగా చెప్పవచ్చు. అమెరికన్ పాత సినిమాల ప్రభావం దీనిపై ఉంది. ఆ సినిమాల్లో పాత రోజుల్లో హీరో పెట్టుకునే హ్యాట్ కలర్ వైట్‌గాను, విలన్ ధరించే హ్యాట్ బ్లాక్ కలర్‌లోను ఉండేవి. ఈ పోలికనే హ్యాకర్ల స్వభావం, నైతికతకు ఆపాదిస్తూ వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్లుగా పోల్చడం ప్రారంభమైంది.
1980లలో, సెక్యూరిటీ నిపుణులు, ఇతర ఔత్సాహిక సైబర్ నిపుణులు తమను తాము వర్గీకరించుకునేందుకు ఈ బ్లాక్, వైట్ హ్యాట్ పదాలను వాడటం ప్రారంభించారు. ఇలా 1985 నాటికి టెక్నికల్ కమ్యూనిటీలో ఈ పదాలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఇక గ్రే హ్యాట్ అనేది అప్పటికి లేదు. కేవలం వైట్ హ్యాట్ హ్యాకర్లు, బ్లాక్ హ్యాట్ హ్యాకర్లు మాత్రమే ఉండేవారు. అయితే, కొద్ది మంది హ్యాకర్లు మంచివారా, చెడ్డవారా అని వర్గీకరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ స్పష్టత లేని కారణంగా, ఈ రకం హ్యాకర్లను బ్లాక్ హ్యాట్, వైట్ హ్యాట్ హ్యాకర్లలో చేర్చకుండా, వారికి మధ్యస్థంగా గ్రే హ్యాట్ హ్యాకర్లుగా పిలవడం ప్రారంభించారు. ఇలా గ్రే హ్యాట్ హ్యాకర్లు అనే మూడో వర్గం ఏర్పడింది. అయితే, ఇది ప్రత్యేకంగా ఎవరూ "ఇలా వైట్, బ్లాక్, గ్రే హ్యాట్ హ్యాకర్లని పిలవాలి" అని నియమించకపోయినా, సాంకేతిక సమాజంలో ఇది ప్రాచుర్యం పొందడం ద్వారా మంచి, చెడు, మధ్యస్థ ప్రవర్తన ఆధారంగా ఈ వర్గాలు ఏర్పడ్డాయి.
సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో, వైట్ హ్యాట్ హ్యాకర్లు (అంటే ఎథికల్ హ్యాకర్లు) అవసరం ప్రపంచానికి ఎంతో ఉంది. చాలా సంస్థలు నిపుణులైన ఎథికల్ హ్యాకర్ల కోసం ఎదురుచూస్తున్నాయి. మంచి పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే, చక్కటి జీతంతో పాటు నైతిక హ్యాకర్‌గా పేరు పొందవచ్చు.