SearchGPT: మీకు ఇంటర్నెట్ ద్వారా ఏదైనా సమాచారం కావాలంటే దాన్ని కనుగొనడానికి మీరు ఏ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగిస్తారు? చాలా మంది వ్యక్తులు ఇంటర్నెట్ ద్వారా ఏదైనా వెతకడానికి ఎక్కువగా గూగుల్‌ను ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు ప్రజలకు కొత్త ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త ఆప్షన్ పేరు SearchGPT. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓపెన్ ఏఐ లాంచ్ చేసిన సెర్చ్ ఇంజిన్...
వాస్తవానికి ఓపెన్ఏఐ దాని ఛాట్‌బాట్ ఛాట్‌జీపీటీకి కొత్త సెర్చ్ ఫీచర్‌ని యాడ్ చేసింది. దీనికి "SearchGPT" అని పేరు పెట్టారు. ఈ SearchGPT అనేది ఓపెన్ ఏఐ లాంచ్ చేసిన సెర్చ్ ఇంజిన్. ఇది గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర దిగ్గజ సెర్చ్ ఇంజిన్‌లతో పోటీపడగలదు. ఓపెన్ఏఐ తన చాట్‌బాట్‌లోనే ఈ కొత్త ఫీచర్‌ను చేర్చింది. ఈ ఫీచర్ ఛాట్‌జీపీటీ వినియోగదారులకు ఇంటర్నెట్ నుంచి ప్రత్యక్ష సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో వార్తలు, స్పోర్ట్స్ లైవ్ అప్‌డేట్‌లు, వాతావరణ అప్‌డేట్‌లు, స్టాక్ ధరలు వంటి అనేక తాజా సమాచారం ఉంటుంది.
అదనంగా ఛాట్‌జీపీటీ ఇప్పుడు ప్రశ్నకు సమాధానమిచ్చేటప్పుడు దాని సోర్స్‌ను కూడా చూపుతుంది. ఇది వినియోగదారులకు మరింత నమ్మకాన్ని అందిస్తుంది. ఓపెన్ఏఐ... గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల సెర్చ్ ఇంజిన్‌ల కంటే వేగవంతమైన, సులభమైన సెర్చ్ ఆప్షన్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రాబోయే నెలల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురాబడుతుంది.
Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు షేక్...
ఈ సెర్చ్ ఫీచర్‌ను ప్రారంభించిన తర్వాత ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ), మైక్రోసాఫ్ట్ స్టాక్‌లు క్షీణించాయి. ఆల్ఫాబెట్ స్టాక్స్ దాదాపు రెండు శాతం పడిపోయాయి. మైక్రోసాఫ్ట్ స్టాక్స్ ఏకంగా ఆరు శాతం పడిపోయాయి. ఈ కొత్త సెర్చ్ ఫీచర్ గూగుల్, బింగ్ వంటి ఇప్పటికే ఉన్న సేవలను సవాలు చేయగలదని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకించి మైక్రోసాఫ్ట్ కూడా ఓపెన్ఏఐలో సుమారు 14 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది. ఈ కొత్త ఫీచర్ మైక్రోసాఫ్ట్ ఏఐ సేవలు, బింగ్‌పై ప్రభావం చూపుతుంది.
ఓపెన్ఏఐ దాని సెర్చ్ మోడల్ జీపీటీ-4 ప్రత్యేక వెర్షన్‌పై ఆధారపడి ఉందని తెలుస్తోంది. ఇందులో వార్తలు, బ్లాగ్ పోస్ట్‌ల వంటి కంటెంట్‌కి లింక్‌లు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఛాట్‌జీపీటీ ప్లస్, టీమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. రాబోయే నెలల్లో అందరు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ లాంచ్ తర్వాత ఛాట్‌జీపీటీ సెర్చ్ ఇంటర్‌ఫేస్... Perplexity వంటి ఇతర ఏఐ పవర్డ్ సెర్చ్ ఇంజన్‌ల మాదిరిగానే మారింది. అలాగే యాడ్స్ కూడా లేనందున గూగుల్ కంటే క్లీనర్ అనుభవాన్ని అందిస్తుంది.
ఏఐ రంగంలో ఇప్పటికే ఓపెన్ఏఐ తన మార్కును చూపింది. ఇప్పుడు సెర్చింజన్ విభాగంలో కూడా సత్తా చూపించడానికి రెడీ అయింది. మరి ఈ కొత్త పోటీని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పాతుకుపోయిన కంపెనీలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.
Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?