Facebook and Instagram Blue Tick: ఒకప్పుడు సోషల్ మీడియాలో బ్లూటిక్ ఉందంటే వారు సెలబ్రిటీ కిందనే లెక్క. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. నెలకు రూ.రెండు వేల వరకు ఖర్చు పెట్టుకునే స్థోమత ఉంటే చాలు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో దర్జాగా సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకోవచ్చు (కొనుక్కోవచ్చు). మొదట ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ పేరుతో వెరిఫికేషన్ టిక్‌కు నగదు వసూలు చేయగా, ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా అదే బాట పట్టనున్నట్లు మెటా ప్రకటించింది. ఈ విషయంలో మెటాకు ట్విట్టర్ ఆదర్శం అని చెప్పవచ్చు.


ఒకప్పుడు సోషల్ మీడియా యాప్‌లలో బ్లూ టిక్ సెలబ్రిటీలకు ఉచితంగా లభించేది. కానీ ఇప్పుడు అలా కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ డబ్బు చెల్లించి సోషల్ మీడియా యాప్‌లలో బ్లూ టిక్ పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా బ్లూ టిక్‌ల కోసం ట్విట్టర్ 'ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్'ని ప్రారంభించింది. ఇప్పుడు దీని తర్వాత మెటా తన ఉత్పత్తులకు పెయిడ్ వెరిఫికేషన్ సర్వీసును కూడా ప్రకటించింది. అంటే ఇప్పుడు మీరు డబ్బు చెల్లించి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌లను సులభంగా పొందవచ్చు.


ఎంత డబ్బు చెల్లించాలి?
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఇప్పుడు మెటా కూడా పెయిడ్ వెరిఫికేషన్ సర్వీసును ప్రారంభించనుంది. వెబ్ వినియోగదారులు ప్రతి నెలా 11.99 డాలర్లు అంటే మనదేశ కరెన్సీలో రూ. 982, ఐవోఎస్ వినియోగదారులు 14.99 డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 1,240 ఖర్చు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ ఆండ్రాయిడ్ కోసం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కోసం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఇప్పుడే ప్రారంభం అయింది. ఇది క్రమంగా ఇతర దేశాలలో కూడా ప్రారంభం అవుతుంది.


బ్లూ టిక్ కోసం ట్విట్టర్ ఎంత ఖర్చు పెట్టాలి?
బ్లూ టిక్ కోసం ట్విట్టర్ వెబ్ వినియోగదారుల నుంచి నెలకు రూ.650, ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారుల నుంచి రూ.900 వసూలు చేస్తుంది. ఇక్కడ గమనించాల్సంది ఏంటంటే Facebook, Instagramలో మీరు ప్రభుత్వ ఐడీ ద్వారా మీ ఖాతాను ధృవీకరించాలి. దీంతోపాటు నగదు కూడా చెల్లించాలి. మొదట చెల్లింపు చేసిన తర్వాత, మీరు బ్లూ టిక్ కోసం ఐడీని సబ్మిట్ చేయాలి.


అయితే మీరు ట్విట్టర్‌లో అయితే చెల్లింపు చేసిన వెంటనే బ్లూ టిక్ పొందుతారు. మెటా పెయిడ్ వెరిఫికేషన్ సర్వీస్ వ్యక్తిగత అకౌంట్ల కోసం మాత్రమే విడుదల చేసింది. ఇది పేజీల కోసం కాదు. ఈ పెయిడ్ సర్వీసును కొనుగోలు చేసే వారికి మెరుగైన కస్టమర్ సపోర్ట్, సెక్యూరిటీ లభిస్తుంది.