Best TWS Earphones: ఇయర్‌బడ్స్‌ -  ప్రస్తుతం ప్రతి ఒక్క స్మార్ట్‌ఫోన్‌ యూజర్‌కు ముఖ్యమైన యాక్ససెరీగా ఇది మారిపోయింది. రకరకాల డిజైన్స్‌లో,  సైజుల్లో, బడ్జెట్‌ ధరల్లో డిఫరెంట్‌ ఫీచర్స్‌తో అందుబాటులో దొరుకుంటుంది.  ఇప్పటికే ఎన్నో కంపెనీలు వీటిని యూజర్స్​ను ఆకట్టుకునేలా  విడుదల చేశాయి. అయితే బెస్ట్ ఆఫర్ సేల్స్​ వచ్చినప్పుడు, ఏఏ ఫీచర్స్​ ఉన్న ఇయర్​ బడ్స్​ను  ఎంచుకోవాలో తెలీక చాలామంది కాస్త ఇబ్బంది పడుతుంటారు. మరి ఇంతకీ ఇయర్‌ బడ్స్‌ కొనుగోలు చేసే ముందు ఏఏ అంశాలను  పరిగణనలోకి తీసుకుని కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం.


మార్కెట్​లో ఉన్న ఇయర్ బడ్స్​ ఇవే -  మార్కెట్లో ప్రస్తుతం నెక్‌ బ్యాండ్‌, టీడబ్ల్యూఎస్‌, వైర్ సహా పలు రకాల ఇయర్‌ ఫోన్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో ముఖ్యంగా బ్లూటూత్‌ ఆధారంగా పని చేసే వాటికి డిమాండ్ ఎక్కువ. అయితే ఈ ఇయర్ బడ్స్​ను కొనుగోలు చేసే ముందు  బ్లూటూత్‌ కనెక్టివిటీ, సౌండ్‌ క్వాలిటీ,  నాయిస్‌ క్యాన్సిలేషన్‌,   బ్యాటరీ లైఫ్‌, సహా పలు ఫీచర్స్​ను చెక్​  చేసుకోవాలి.


బ్యాటరీ కెపాసిటీ -  మొదటగా  బ్యాటరీ చూసుకోవాలి.  ఎందుకంటే బ్లూటూత్‌ ఇయర్‌ బడ్స్‌ వాడినప్పుడు  లాంగ్‌ బ్యాటరీ లైఫ్‌ ఉండాల్సిందే.  అయితే ట్రూ వైర్‌ లెస్‌ విషయంలో  మాత్రం కేస్‌, ఇయర్‌బడ్స్​ వేర్వేరు బ్యాటరీలు ఉంటాయి.  ఇవి రెండు కలిపి కనీసం  35 గంటల కంటే ఎక్కువ ప్లే బ్యాకప్‌ ఉండేలా చూసుకోవాలి.


బ్లూటూత్‌ - ఇప్పుడు చాలా వరకు బ్లూటూత్‌ 5.0 + కనెక్టివిటీతో ఇయర్ బడ్స్​ వస్తున్నాయి. 5.3, 5.4  లేటెస్ట్‌ వెర్షన్స్​. వీలైనంత వరకు లేటెస్ట్‌ వెర్షన్‌ బ్లూటూత్‌  ఉన్న ఇయర్‌ బడ్స్‌ను తీసుకోవడం మంచింది.  ఇవి తక్కువ లేటెన్సీ, బెటర్‌ ఆడియో క్వాలిటీని అందిస్తాయి. త్వరగా పెయిర్‌ అవుతాయి.


లేటెన్సీ -  ఆడియో, వీడియోను సరిగ్గా సింక్‌ చేయడమే దీని పని. ఇది ఎంత తక్కువుంటే అంత మంచిది. అప్పుడే వీడియోను బాగా ఆస్వాదించవచ్చు.  గేమర్లు వీలైనంత తక్కువ లేటెన్సీ ఉన్న వాటినే  తీసుకోవడం ఉత్తమం.   గరిష్ఠ లేటెన్సీ 100 మిల్లీ సెకన్లు ఉంటుంది.  యావరేజ్‌ అయితే 50- 100 వరకు మిల్లీ సెకన్లు ఉంటుంది.  తక్కువ అంటే 20- 40 మిల్లీ సెకన్ల వరకు ఉంటుంది.  20 మిల్లీ సెకన్ల కన్నా తక్కువ ఉంటే మంచి ఇయర్‌ ఫోన్స్‌ అనొచ్చు.


నాయిస్‌ క్యాన్సిలేషన్‌  -  టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌ బడ్స్‌ కొనేటప్పుడు  నాయిస్‌ క్యాన్సిలేషన్‌  పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇందులో ఒకటి యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌(ఏఎన్‌సీ), రెండోది పాసివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌. ఈ రెండో దాన్ని ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌(ఈఎన్‌సీ) అని కూడా పిలుస్తుంటారు.


ఏఎన్‌సీ అంటే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ. బయటి నుంచి వచ్చే శబ్దాలను అనలైజ్‌ చేసి, యాంటీ నాయిస్‌ సౌండ్‌ వేవ్‌లను పంపించి బయటి నుంచి వచ్చే శబ్దాలను రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి బెస్ట్​ ఏఎన్​సీ ఉన్న ఇయర్‌ బడ్స్ తీసుకుంటే.. బయటి శబ్దాలు వినపడకుండా సౌండ్​ను బాగా వినొచ్చు.
ఎన్విరానిమెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ అంటే మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు మీ చుట్టూ ఉన్న శబ్దాన్ని అవతలి వ్యక్తి వినకుండా ఉండేలా చేస్తుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ నాయిస్‌ తగ్గించి, కాల్‌ నాణ్యతను మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ రెండూ ఉండేలా హైబ్రిడ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఉన్న ఇయర్‌ బడ్స్‌ కొనడం ఉత్తమం.


కంఫర్ట్‌, ఫిట్‌ - చాలా సార్లు ఫీచర్లు అన్నీ బాగున్నా, మనకు కావాల్సినవి అందులో ఉన్నా అవి ధరించడానికి కంఫర్ట్​గా, ఫిట్​గా ఉండకపోవచ్చు. ముఖ్యంగా టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌ బడ్స్‌ విషయంలో ఇది జరగొచ్చు. ఎందుకంటే అవి ఎక్కడ పడిపోతాయోనన్న భయం కూడా ఉంటుంది. కాబట్టి కంఫర్ట్​ ఉన్నవి ఒకటికి పది సార్లు చూసి కొనుగోలు చేయాలి. నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్​ విషయంలోనూ అంతే.


ఇవి కూడా ఉంటే ఇంకా మంచిది -  టీడబ్ల్యూఎస్‌ ఇయర్​ బడ్స్‌ కొనుగోలు చేస్తే టచ్‌ కంట్రోల్‌ ఫీచర్స్‌ ఎంత మెరుగ్గా ఉన్నయో తెలుసుకోవాలి.  రివ్యూలు కూడా  చూడాలి. ఐపీ రేటింగ్‌ ఉందా? లేదా? అనే విషయాన్నీ కూడా తెలుసుకోవాలి.  కస్టమర్‌ సేవలు, వారెంటీ ఇచ్చే బ్రాండ్‌లు తీసుకోవడం బెస్ట్ ఛాయిస్.